అదిగో అద్దె గది

1 Mar, 2019 10:01 IST|Sakshi

క్షణాల్లో రూమ్‌.. గంటల్లో రెంట్‌  

క్యాబ్‌ బుకింగ్‌ తరహాలో హోటల్‌ గదులు   

‘పోబైట్‌’ యాప్‌తో అందుబాటులోకి

రూ.150 నుంచి అద్దె రుసుం ప్రారంభం  

వినూత్న ఆలోచనకు సిటీ యూత్‌ శ్రీకారం

సికింద్రాబాద్‌ స్టేషన్‌లో బస్సు దిగిన కావ్య.. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణంతో బాగా అలసిపోయింది. మాదాపూర్‌లో ఇంటర్వ్యూకి ఇంకా మూడు గంటల సమయం ఉంది. కాసేపు ఎక్కడైనా రెస్ట్‌ తీసుకుని తర్వాత ఇంటర్వ్యూకి వెళితే బాగుంటుందనుకుంది. కానీ ఆమెకునగరంలో తెలిసిన వారెవరూ లేరు. మరెలా?  అవినాష్‌ ఆఫీస్‌గచ్చిబౌలిలో ఉంది. వర్క్‌ కూడా అయిపోయింది. కాసేపట్లో తన ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీకి జూబ్లీహిల్స్‌ వెళ్లాలి. డ్రెస్‌ చేంజ్‌ చేసుకుని ఫ్రెష్‌ అవకుండా పార్టీకి వెళితే బాగుండదు. కానీ బోడుప్పల్‌లో ఉన్నఇంటికి వెళ్లి వస్తే పార్టీ సమయం దాటిపోతోంది ఇప్పుడెలా? 

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొనేవే. ఇవే కాదు ఇలాంటి మరెన్నో ఇబ్బందులకు సమాధానం తమ ‘పోబైట్‌’ యాప్‌ (www.pobyt.co) చెబుతుందంటున్నారు నిఖిల్‌రెడ్డి. రంగారెడ్డి జిల్లా గుర్రాలకు చెందిన ఆయన అమెరికాలో ఉన్నత చదువు, పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయంలో వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ ‘పోబైట్‌’ అని వెల్లడించారు. సింగపూర్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ పూర్తి చేసిన నిఖిల్‌ సోదరుడు నిహాల్‌రెడ్డి, ఐఐటీ మద్రాస్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డ్యూయల్‌ డిగ్రీ చేసిన భార్య మేఘన కోలన్‌ కలిసి యాప్‌ ద్వారా అచ్చంగా క్యాబ్‌ బుకింగ్‌ తరహాలో తక్షణ అవసరాల కోసం హోటల్‌ రూమ్స్‌ అందిస్తుండడం విశేషం. అవసరమైన వెంటనే బుక్‌ చేసుకోగలగడంతో పాటు ఎంతసేపు వినియోగిస్తే అంత సమయానికి మాత్రమే డబ్బులు చెల్లించేందుకు వీలుగా నిఖిల్‌రెడ్డి ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. 

నిఖిల్‌, నిహాల్‌ , మేఘన
మారుతున్న అవసరాలకుఅనుగుణంగా..
రియల్‌ ఎస్టేట్‌ ధరల పుణ్యమాని సిటీలో ఇంటి అద్దెలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో చాలామంది సిటీలో ఉద్యోగాలు చేస్తూ శివార్లలో నివాసముంటున్నారు. దీనివల్ల ఇంటి అద్దె భారం తగ్గినా ఆఫీసులకు ఉద్యోగుల రాకపోకల సమయం బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో రిలాక్స్‌ అవడానికో, రెస్ట్‌ కోసమో ఇంటికి, ఆఫీసుకి మధ్య కొన్నిసార్లు తాత్కాలిక బస అవసరం అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమావేశాలతో, ఈవెంట్స్‌తో అలసిపోయాక పార్టీలకో, మరేదైన ముఖ్యమైన మీట్‌కో వెళ్లాల్సి ఉంటే కాసింత ఫ్రెష్‌ అవడానికి ఏదైనా రూమ్‌ దొరికితే బాగుండుననిపిస్తుంది. దగ్గరలో ఉన్న ఏ ఫ్రెండ్‌నో.. బంధువులనో అడగాలంటే సమయానికి వారు అందుబాటులో ఉండకపోవచ్చు.

ఇలాంటి సమయాల్లో ఓ గంట.. రెండు గంటలు రెస్ట్‌ తీసుకునేందుకు గది దొరికితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా హోటల్‌కువెళితే మాత్రం ఫుల్‌ డే డబ్బులు చెల్లించాల్సిందే. కిలోమీర్‌కు ఇంత అని క్యాబ్‌కు చెల్లిస్తున్నప్పుడు.. గది అద్దె కూడా అలా చెల్లించే వెసులుబాటు ఉంటే బాగుంటుంది కదా..! ఇలాంటి ఆలోచన నుంచి పుట్టిందే ‘పోబైట్‌’ యాప్‌. ‘నిమిషాల్లో క్యాబ్‌ని అందించగలుగుతున్నప్పుడు హోటల్‌ రూమ్‌ని ఎందుకు అందించలేం? అని ఆలోచించాం. కేవలం రిలాక్స్‌ అవడానికో, రెస్ట్‌ తీసుకోవడానికో మాత్రమే కాక ఏకాంతంగా ఉండే ప్రదేశంలో కొన్ని గంటల్లో పర్సనల్‌ కంప్యూటర్‌ ద్వారా పనులు చక్కబెట్టుకునేవారికి, దూర ప్రాంతాలకు విమాన ప్రయాణం చేస్తూ మధ్య ఏదైనా సిటీలో బ్రేక్‌ జర్నీ చేసేవారికి ఉపయోగపడేలా ఏదన్నా చేయాలనుకున్నాం. అదే ఈ యాప్‌ ద్వారా అందిస్తున్నాం’ అని చెప్పారు నిఖిల్‌.   

ఉభయులకుఅనుకూలంగా..
విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యవంతమైన బెడ్, ఎయిర్‌ కండిషన్, వైఫై సేవలు, ఇంకా కావాలనిపిస్తే డ్రింక్స్, స్నాక్స్‌.. అన్నీ అందించే తాత్కాలిక బస అంటే హోటల్‌ రూమ్‌ని మించి ఏముంటుంది? ‘కనీసం 3 స్టార్‌ హోటల్స్‌ మా ప్రాధాన్యం’ అంటున్నారు నిఖిల్‌. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఒక లగ్జరీ బెడ్, బాత్‌టబ్‌ సహా అన్ని సౌకర్యాలను  జేబులో పెట్టుకున్నట్టే అంటున్నారాయన. మరోవైపు చాలా నగరాల్లో హోటల్స్‌ నిర్వాహకులు కూడా రద్దీ సమయాల్లో తప్ప గదులు ఖాళీగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాంటి వారికి తమ యాప్‌ ద్వారా ఆక్యుపెన్సీ, ఆదాయం రెండూ పెరుగుతాయని అంటోందీ బృందం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో పలు హోటల్స్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. అధికారికంగా వినియోగదారులకు గైడ్‌ చేసేలా ఆటోవాలాలకు కూడా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. 

మరిన్ని వార్తలు