చిన్న పట్టణాల్లోనూ ‘స్టార్టప్స్‌’

9 May, 2017 00:41 IST|Sakshi
చిన్న పట్టణాల్లోనూ ‘స్టార్టప్స్‌’

► టాప్‌–10లో లేని మెట్రో నగరాలు
► వ్యవస్థాపకుల్లో 46 శాతం మహిళలు
► నిధుల కోసం చూస్తున్న కంపెనీలు
► ఇండియా ఫండ్‌ ఫెస్ట్‌ నివేదిక


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టార్టప్స్‌ అనగానే ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయన్న భావన చాలా మందిలో ఉంది. వాస్తవానికి స్టార్టప్స్‌ కల్చర్‌ దేశవ్యాప్తంగా విస్తరించింది. చిన్న నగరాల్లోనే ఇవి ఎక్కువగా పుట్టుకొస్తున్నాయని ఇండియా ఫండ్‌ ఫెస్ట్‌ నివేదిక చెబుతోంది. కన్సల్టింగ్‌ సంస్థ నేషియో కల్టస్‌ మే 12న బెంగళూరులో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఫెస్ట్‌ కోసం దేశవ్యాప్తంగా 274 నగరాలు, పట్టణాల నుంచి 6,527 దరఖాస్తులు వచ్చాయి.

టాప్‌–10 జాబితాలో లక్నో, పాట్నా, ఇండోర్, ఆగ్రా, చండీగఢ్, అహ్మదాబాద్‌ తర్వాతి స్థానాన్ని హైదరాబాద్‌ కైవసం చేసుకుంది. పుణే, జైపూర్‌ల తర్వాత బెంగళూరు నిలిచింది. ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే తొలి 10 స్థానాల్లో మెట్రో నగరాలు చోటు సంపాదించుకోలేదు. 12–18 మధ్య ర్యాంకులతో ఇవి సరిపెట్టుకున్నాయి. దరఖాస్తుల పరంగా దక్షిణాది రాష్ట్రాలు రెండో స్థానంలో ఉన్నాయి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టాప్‌–5లో పోటీపడ్డాయి. మొత్తంగా 663 కంపెనీలు షార్ట్‌ లిస్ట్‌ కాగా, 42 కంపెనీలు ఫండబుల్‌ జాబితాలో ఫెస్ట్‌కు ఎంపికయ్యాయి.

ముందుకొస్తున్న మహిళలు..: షార్ట్‌ లిస్ట్‌ అయిన వాటిలో 46 శాతం కంపెనీల్లో ఫౌండర్లుగా మహిళలు ఉండడం విశేషం. వ్యాపారం పట్ల మహిళలూ ఆసక్తి చూపుతున్నారనడానికి ఇది ఉదాహరణ అని ఫెస్ట్‌ చైర్మన్‌ దినేశ్‌ సింగ్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. దక్షిణాది కంపెనీల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక మొత్తం దరఖాస్తుల్లో కేవలం 22 శాతం మాత్రమే టెక్నాలజీ సంబంధ కంపెనీలు. షార్ట్‌ లిస్ట్‌ అయిన కంపెనీల్లో మూడింట రెండొంతులు ట్రేడ్‌మార్క్‌ పొందడం లేదా దరఖాస్తు చేశాయి. పేటెంట్లు పొందిన, దరఖాస్తు చేసిన కంపె నీలు 14 శాతమున్నాయి.

24 సంవత్సరాలలోపు యువకులూ స్టార్టప్స్‌ను ప్రారంభించిన వారిలో ఉన్నారు. వీరి ఖాతాలో 9% కంపెనీలు ఉన్నాయి. వ్యవస్థాపకుల్లో 36–40 ఏళ్ల వయసున్నవారు 28%, 25–30 మధ్య వయస్కులు 24 శాతమున్నారు. షార్ట్‌ లిస్ట్‌ అయినవాటిలో 3% మాత్రమే వాల్యుయేషన్‌ రిపోర్టును కలిగి ఉన్నా యి. ఈ విషయంలో చిన్న నగరాలు వెనుకంజలో ఉన్నాయి. అవగాహన, శిక్షణ లేకుండానే కంపెనీలను ప్రారంభిస్తున్నవారు ఎందరో ఉన్నారు. స్టార్టప్స్‌లో పరిపక్వత రావాల్సిన అవసరం ఉందని ఫెస్ట్‌ మెంటార్‌ నళిన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి నిధులు, పన్ను మినహాయింపు వంటి సాయానికి 94% కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.

నిధులు కావాలి..
దేశవ్యాప్తంగా నిధుల కోసం స్టార్టప్స్‌ చూస్తున్నాయని నళిన్‌సింగ్‌ తెలిపారు. పెట్టుబడి కంపెనీలు మెట్రోలను వదిలి చిన్న నగరాలను చూసే పరిస్థితి ఉందన్నారు. రూ.50–100 లక్షల సాయం కోసం 23% కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయి. రూ.1–2 కోట్ల కోసం 19%, రూ.25–50 లక్షల కోసం 17 % దరఖాస్తులు వచ్చాయి. రూ.10 లక్షల లోపు నిధుల కోసం 14 శాతం దరఖాస్తులు రావడం విశేషం. మరో ఆసక్తికర విషయమేమంటే షార్ట్‌ లిస్ట్‌ అయిన వాటిలో 73 శాతం కంపెనీలు స్టార్టప్‌ ఈవెంట్స్‌లో గతంలో పాలుపంచుకున్నవే.

అయితే మూడు కంపెనీలు మాత్రమే పాక్షికంగా నిధులను అందుకున్నాయి. దీనినిబట్టి చూస్తే నిధులు ఎన్ని కంపెనీలకు అవసరమో అవగతమవుతోంది. షార్ట్‌ లిస్టెడ్‌ కంపెనీల్లో 19 మాత్రమే స్నేహితులు, బంధువులు కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఫండ్‌ను పొందాయి. ఇప్పటి వరకు జరిగిన స్టార్టప్‌ ఈవెంట్స్‌లో కంపెనీలతో ఇన్వెస్టర్ల ముఖాముఖి కొన్ని నిమిషాలకే పరిమితమయ్యేది. ఇంత తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లు పెట్టుబడి నిర్ణయం ఎలా తీసుకున్నారో ఆశ్చర్యం కలుగుతోందని ఫెస్ట్‌ మెంటార్‌ సునీల్‌ గిరిధర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు