ఎస్‌బీఐ నికర లాభం.. రికార్డ్‌ 

5 Jun, 2020 15:20 IST|Sakshi

క్యూ4లో రూ. 3581 కోట్లు

ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీవో నిధుల దన్ను

రూ. 2731 కోట్ల వన్‌టైమ్‌ లాభం

షేరు 8 శాతం హైజంప్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి-మార్చి)లో పీఎస్‌యూ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ రూ. 3581 కోట్ల నికర లాభం ఆర్జించింది. తద్వారా స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఒక క్వార్టర్‌లో బ్యాంక్‌ అత్యధిక లాభాలు ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో సాధించిన రూ. 838 కోట్లతో పోలిస్తే ఇది 327 శాతం వృద్ధి. తాజా త్రైమాసికంలో రూ. 2731 కోట్లమేర లభించిన వన్‌టైమ్‌ లాభం బ్యాంకుకు అండగా నిలిచింది. ఐపీవో ద్వారా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డ్స్‌లో ఎస్‌బీఐ వాటాను విక్రయించడం ద్వారా ఈ నిధులు సమకూరాయి. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం రూ.6910 కోట్లను తాకింది. ఇక క్యూ4లో రూ. 13,495 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టింది. నికర వడ్డీ ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,954 కోట్లకు పరిమితమైంది. స్థూల మొండిబకాయిలు 6.94 శాతం నుంచి 6.15 శాతానికి నీరసించగా.. నికర ఎన్‌పీఏలు 2.23 శాతానికి చేరాయి.

షేరు జూమ్‌
ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 8 శాతం జంప్‌చేసింది. రూ. 188 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 190 వరకూ ఎగసింది. క్యూ4లో మారటోరియానికి 21.8 శాతం మంది కస్టమర్లు మొగ్గుచూపినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. కాలావధి రుణాల కస్టమర్లలో 23 శాతం మంది ఇందుకు ఆసక్తి చూపినట్లు తెలియజేసింది. పూర్తిఏడాది(2019-20)కి నికర వడ్డీ మార్జిన్లు 2.95 శాతంగా నమోదయ్యాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 13.06 శాతానికి చేరింది. క్యూ4లో కార్పొరేట్‌ స్లిప్పేజెస్‌ రూ. 1561 కోట్లకు చేరగా.. అగ్రి విభాగంలో రూ. 5238 కోట్లుగా నమోదైనట్లు బ్యాంక్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు