తగ్గిన ఎస్‌బీఐ రుణ రేటు

10 Dec, 2019 04:41 IST|Sakshi

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఏడాది కాల వ్యవధి ఉండే రుణాలపై వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించింది. నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటు 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బ్యాంక్‌ ఎంసీఎల్‌ఆర్‌ తగ్గడం ఇది వరుసగా ఎనిమిదవసారి. తాజా తగ్గింపుతో ఏడాది కాల ఎంసీఎల్‌ఆర్‌ 8% నుంచి 7.90%కి దిగివచ్చింది. తన గతవారం పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ ఎటువంటి రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 5.15%) తగ్గింపు నిర్ణయం తీసుకోని నేపథ్యంలో ఎస్‌బీఐ తాజా రుణరేటు కోత ప్రాధాన్యత సంతరించుకుంది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 20 బేసిస్‌ పాయింట్లు
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఎంసీఎల్‌ఆర్‌ను 20 బేసిస్‌ పాయింట్ల వరకూ తగ్గించింది. ఓవర్‌నైట్‌ రుణ రేటు 20 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. దీనితో ఈ రేటు 7.75%కి దిగివచ్చింది. ఇతర కాలపరి మితి రేట్లు 10 బేసిస్‌ పాయింట్లు తగ్గాయి.  ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 8.30% నుంచి 8.20%కి చేరింది.

>
మరిన్ని వార్తలు