ఫేస్బుక్, ట్వీటర్లో ఎస్బీఐ సేవలు

2 Jul, 2016 00:55 IST|Sakshi
ఫేస్బుక్, ట్వీటర్లో ఎస్బీఐ సేవలు

న్యూఢిల్లీ: వివిధ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ల ద్వారా బ్యాంక్ సేవలను పొందే అవకాశాన్ని ఎస్‌బీఐ అందిస్తోంది.  ఫేస్‌బుక్, ట్వీటర్ అకౌంట్ల  ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులు  వివిధ బ్యాంక్ సేవలను పొందేలా ‘ఎస్‌బీఐ మింగిల్’ను ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది. ఎస్‌బీఐ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఎస్‌బీఐ మింగిల్‌ను  ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య ప్రారంభించారు.  చెక్‌బుక్ రిక్వెస్ట్, చెక్‌లకు చెల్లింపులు నిలిపేయడం, మొబైల్ బ్యాంకింగ్‌కు నమోదు చేసుకోవడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు, ఏటీఎం/డెబిట్ కార్డులను బ్లాక్ చేయడం.. తదితర సేవలను కూడా ఎస్‌బీఐ మింగిల్‌లో అందుబాటులోకి తెస్తామని ఆమె పేర్కొన్నారు.

 ఫ్లిప్‌కార్ట్‌లో ఎస్‌బీఐ ఈఎంఐలు
ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ఒక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని అరుంధతి భట్టాచార్య చెప్పారు.  ఈ ఒప్పందంలో భాగంగా ముందుగా అర్హత పొందిన వినియోగదారులు  ఫ్లిప్‌కార్ట్‌లో వస్తువులను సమాన నెలవారీ వాయిదా(ఈఎంఐ)పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు.   కనీస కొనుగోలు రూ.5,000గా ఉండాలి 6/9/12 నెలల్లో ఈఎంఐ(సమాన నెలవారీ వాయిదా)ల్లో ఈ మొత్తాన్ని  చెల్లించవచ్చు. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. 14 శాతం వడ్డీ వసూలు చేస్తారు. 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎస్‌బీఐ డిజిటల్ విలేజేస్, స్టేట్ బ్యాంక్ బడ్డీ తదితర ఫీచర్లను కూడా ఎస్‌బీఐ అందుబాటులోకి తెచ్చింది.

 ఈ ఏడాది కీలకం...
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్లు బ్యాంక్ 61వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా  చైర్మన్ అరుంధతీ భట్టాచార్య పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్ విలీనాన్ని ప్రస్తావించారు. ఇది ఎస్‌బీఐకి అంతర్జాతీయ బ్యాంకింగ్ స్థాయి తీసుకువస్తుందని, వరల్డ్ టాప్ 50 బ్యాంకుల్లో ఒకటిగా ఉంటుందని అన్నారు. కొంచెం అటుఇటుగా ఒకేసారి అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.

 ఎస్‌బీఐ, రిలయన్స్‌ల ఒప్పందం...
చెల్లింపు బ్యాంక్(పేమెంట్స్ బ్యాంక్) ఏర్పాటు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐలు సబ్‌స్క్రిప్షన్ అండ్ షేర్‌హోల్డర్స్ అగ్రిమెంట్‌ను కుదర్చుకున్నాయి. ఈ జాయింట్ వెంచర్ కోసం ఎస్‌బీఐతో ఒప్పందాన్ని గురువారం కుదుర్చుకున్నామని బీఎస్‌ఈకి ఆర్‌ఐఎల్ నివేదించింది. ఈ జేవీలో తమ వాటా 70 శాతమని, ఎస్‌బీఐ వాటా 30 శాతమని పేర్కొంది.

మరిన్ని వార్తలు