ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద సవాలు మొండిబకాయిలు రికవరీ

6 Mar, 2014 01:49 IST|Sakshi
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద సవాలు మొండిబకాయిలు రికవరీ

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) అంతకంతకూ ఎగబాకడం పట్ల ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్‌పీఏలే అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. వీటిని రికవరీ చేసుకునేందుకు మరింత దృష్టిపెట్టాలని, తగు చర్యలు చేపట్టాలని బ్యాంకులకు సూచించారు. బుధవారం ఇక్కడ పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం అనంతరం చిదంబరం విలేకరులతో మాట్లాడారు.

ఈ భేటీలో వాటి త్రైమాసిక ఆర్థిక పనితీరును సమీక్షించారు. మధ్యస్థాయి పరిశ్రమలకు రుణ వితరణ తగ్గిందని, ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి మాత్రం సంతృప్తికరంగానే ఉందని విత్తమంత్రి చెప్పారు. బ్యాంకు చీఫ్‌లతో సమావేశంలో ఎక్కువగా మొండిబకాయిలు, వీటి రికవరీ కోసం చేపట్టాల్సిన చర్యలపైనే చర్చజరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘రియల్టీలో మొండిబకాయిలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ... బడా కార్పొరేట్ రంగాలు, చిన్న పరిశ్రమల్లో ఇవి భారీగా పేరుకుపోతున్నాయి.

అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో పీఎస్‌యూ బ్యాంకులు రూ.18,933 కోట్ల బకాయిలను వసూలు చేయగలిగాయి. అదేవిధంగా ప్రతి బ్యాంక్ కూడా టాప్-30 ఎన్‌పీఏ ఖాతాలపై ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాయి’ అని చిదంబరం వెల్లడించారు. గతేడాది మార్చి చివరి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు రూ. 1.83 లక్షల కోట్లు కాగా... సెప్టెంబర్ నాటికి ఇవి రూ.2.36 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం. అంటే ఏకంగా 28.5 శాతం పెరిగిపోయాయి.

 యునెటైడ్ బ్యాంక్ ఎన్‌పీఏల వివాదంపై...
 ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్‌పీఏల సంక్షోభానికి సంబంధించిన అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ఈ నెల 7న ప్రత్యేకంగా చర్చించనున్నామని చిదంబరం చెప్పారు. ఇది మరీ అంత ఆందోళనకరమైన అంశమేమీ కాదని, రాజన్‌తో భేటీ అనంతరం సమస్య సద్దుమణగనుందని చెప్పారు.

మొండిబకాయిలు, రుణ పునర్‌వ్యవస్థీకరణ గణాంకాల వెల్లడి విషయంలో వైఫల్యానికి గాను యునెటైడ్ బ్యాంక్‌పై అంతర్గత విచారణతో పాటు ఆర్‌బీఐ కూడా ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ చైర్‌పర్సన్ అర్చనా భార్గవ స్వచ్ఛంద పదవీ విరమణతో వైదొలగడం కూడా జరిగింది. గతేడాది మార్చి క్వార్టర్‌లో రూ. 2,964 కోట్లుగా ఉన్న యునెటైడ్ బ్యాంక్ స్థూల ఎన్‌పీఏలు డిసెంబర్ త్రైమాసికం నాటికి ఏకంగా రూ. 8,546 కోట్లకు ఎగబాకడం తెలిసిందే. అంతేకాకుండా ఈ క్వార్టర్‌లో రూ. 1,238 కోట్ల భారీ నికర నష్టాన్ని కూడా ప్రకటించింది.

 పసిడిపై నియంత్రణలను సమీక్షిస్తాం...
 బంగారం దిగుమతులపై నియంత్రణలను తొలగించాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారిస్తోంది. ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గణాంకాలను పరిశీలించిన తర్వాత తప్పకుండా దిగుమతి సుంకాలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడంతో దీని అడ్డుకట్టకోసం దిగుమతులకు కళ్లెం వేసే పలు చర్యలు ప్రకటించడం తెలిసిందే.

ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని దశలవారీగా 10 శాతానికి చేర్చారు. దీని ప్రభావంతో పసిడి దిగుమతులు భారీగా తగ్గడంతోపాటు క్యాడ్ కూడా దిగొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా జీడీపీలో 2.3 శాతానికి(31.1 బిలియన్ డాలర్లు) తగ్గింది. అక్టోబర్ త్రైమాసికంలో అయితే కేవలం 0.9 శాతం(4.2 బిలియన్ డాలర్లు) మాత్రమే నమోదైంది. ఇక బంగారం దిగుమతుల విషయానికొస్తే.. గతేడాది మే నెలలో 162 టన్నుల గరిష్టస్థాయి నుంచి నవంబర్‌లో 19.3 టన్నులకు పడిపోయాయి. కాగా, పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణల కారణంగా స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందని, ఈ నియంత్రణలను సడలించాల్సిన అవసరం ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ కూడా తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు