లేబర్‌ సెస్‌ను వాడుకోండి!

28 Mar, 2020 06:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థలు చెల్లించే లేబర్‌ సెస్‌ను కార్మికుల సంక్షేమానికి వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌–డీబీటీ) ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక, అనుబంధ ప్రయోజనాలను కల్పించడానికి లేబర్‌ సెస్‌ను వినియోగించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖలో 3.5 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారు. ఈ బోర్డులో సుమారు రూ.52 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

రూ.2 వేల కోట్ల లేబర్‌ సెస్‌..
గతేడాది మార్చి నాటికి తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డులో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు. ఇందులో 10 శాతం మంది ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల కార్మికులుంటారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డులో రూ.1,800–2,000 కోట్ల లేబర్‌ సెస్‌ నిల్వ ఉందని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డ్‌ సభ్యుడు గంధం ఆంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డ్‌ ఉన్నవాళ్లకు మాత్రమే లేబర్‌ సెస్‌ ప్రయోజనం వర్తిస్తుందని.. ఆయా కార్మికుల ఆధార్‌ కార్డ్‌ బ్యాంక్‌ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించే ప్రయోజన సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు.

కార్మికులందరికీ ప్రయోజనం..
భవన, నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవల చట్టం కింద కార్మిక సంక్షేమ బోర్డులు లేబర్‌ సెస్‌ను సమీకరిస్తుంటాయి. డెవలప్‌మెంట్‌ అథారిటీ, హౌసింగ్‌ బోర్డు లేదా మున్సిపల్‌ కార్పొరేషన్‌లు ప్రాజెక్ట్‌ వ్యయంలో 1 శాతం సెస్‌ రూపంలో డెవలపర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలోని కార్మికుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లేబర్‌ సెస్‌ను వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (క్రెడాయ్‌) ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్లకు మాత్రమే కాకుండా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈ నిధుల ప్రయోజనం అందేలా చూడాలని క్రెడాయ్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ సీహెచ్‌ రామచంద్రా రెడ్డి కోరారు. శాశ్వత కార్మికులను మాత్రమే డెవలపర్లు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేస్తుంటారు. రోజూ వారీ వేతనం కింద కూలీలు, కాంట్రాక్ట్‌ వర్కర్లను వినియోగించుకుంటారు.

కరోనా ‘కేర్‌’ 
నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్‌ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే..
► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి.
► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి.
► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
► ప్రాజెక్ట్‌ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్‌ చేయాలి.
► ప్రాజెక్ట్‌లు, లేబర్‌ క్యాంప్‌లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు.  
► లాక్‌డౌన్‌ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి.  
► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్‌లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి.
► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి.

>
మరిన్ని వార్తలు