గణాంకాలకు మారనున్న బేస్‌ ఇయర్‌!

16 Feb, 2018 00:47 IST|Sakshi

జీడీపీ, ఐఐపీ, రిటైల్‌ ద్రవ్యోల్బణం బేస్‌ ఇయర్‌గా ఇక 2017–18 

ప్రస్తుతం 2011–12  

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ), పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ), రిటైల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలకు ప్రభుత్వం బేస్‌ ఇయర్‌ను మార్చనుంది. జీడీపీ, ఐఐపీ గణాంకాలకు బేస్‌ ఇయర్‌ 2017–18గా మార్చుతున్నట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ ఇక్కడ జరిగిన ఒక సదస్సులో వెల్లడించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణానికి బేస్‌ ఇయర్‌ను 2018గా మార్చుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మూడు కీలక ఆర్థిక గణాంకాలకూ 2011–12 బేస్‌ ఇయర్‌గా ఉంది. 

ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో పారదర్శకత, స్పష్టత లక్ష్యంగా కేంద్రం బేస్‌ ఇయర్‌ మార్పు నిర్ణయం తీసుకుంటోందన్నారు. గణాంకాల వ్యవస్థ పటిష్టతకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గణాంకాల్లో స్పష్టత ఆవశ్యకత ఎంతో ఉంటుందని అన్నారు. 2018–19లో గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖకు కేంద్రం రూ.4,859 కోట్లను కేటాయించింది.  


   

మరిన్ని వార్తలు