సుప్రీంలో ఆర్‌కామ్‌కు చుక్కెదురు!

23 Mar, 2018 00:54 IST|Sakshi

ఆస్తుల విక్రయంపై స్టే కొనసాగింపు

న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆస్తుల విక్రయ ప్రయత్నాలకు గండిపడింది. తీవ్ర రుణ భారంతో ఉన్న ఆర్‌కామ్, తనకున్న టెలికం ఆస్తులను విక్రయించి అప్పులు తీరుద్దామనే ప్రణాళికతో ఉంది. అయితే, ఆస్తుల విక్రయంపై బోంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి జస్టిస్‌ ఆదర్శ్‌ గోయెల్, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేస్తూ ఆర్‌కామ్, ఆ సంస్థకు రుణాలిచ్చిన ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కూటమి దాఖలు చేసిన పిటిషన్లపై తుది విచారణను ఏప్రిల్‌ 5న నిర్వహిస్తామని పేర్కొంది. ఆర్‌కామ్‌ బ్యాంకులకు రూ.42,000 కోట్లు బకాయి పడి ఉంది.

ఎస్‌బీఐ, 24 ఇతర దేశీయ రుణ దాతలు ఆర్‌కామ్‌కు రుణాలివ్వడంతో అవన్నీ కూటమిగా ఏర్పడి ఆర్‌కామ్‌ కన్సాలిడేటెడ్‌ ఆస్తులను విక్రయించే ప్రక్రియను చేపట్టాయి. ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రం, సెల్‌ టవర్లు, ఇతర సదుపాయాలను కొనుగోలు చేస్తానని రిలయన్స్‌ జియో ఆసక్తి చూపింది. ఇంతలోనే ఎరిక్సన్‌ సంస్థ ఆర్‌కామ్‌ రూ.1,150 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉందని, ఆస్తుల విక్రయాలు జరగకుండా నిరోధించాలంటూ ఆర్బిట్రల్‌ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఆ తర్వాత బోంబే హైకోర్టు స్టే ఆదేశాలను సమర్థించింది. దీంతో ఆర్‌కామ్, బ్యాంకుల కూటమి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. రుణదాతల తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ, బ్యాంకులు ఇచ్చింది సెక్యూర్డ్‌ రుణాలు కనుక వారి క్లెయిమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎరిక్సన్‌ తరఫు న్యాయవాది మాత్రం స్టే ఎత్తివేస్తే తాము బకాయిలు వసూలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని కోర్టుకు తెలిపారు. దీంతో ఇది చాలా పెద్ద అంశం అయినందున, వాదనలు వినాల్సి ఉందని, అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుందని ధర్మాసనం పేర్కొంది.  

ఆస్తుల విక్రయాన్ని వేగంగా పూర్తి చేస్తాం: ఆర్‌కామ్‌ 
సుప్రీంకోర్టులో తక్షణ ఉపశమనం లభించకపోయినప్పటికీ, ఆస్తుల విక్రయాన్ని వేగవంతం చేస్తామని ఆర్‌కామ్‌ తెలిపింది. ఆర్‌బీఐ నిర్దేశించినట్టు ఆగస్ట్‌ 31లోపు తమ ఆస్తుల విక్రయాన్ని పూర్తి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.    

మరిన్ని వార్తలు