స్టెమ్‌ ఉద్యోగాలకు భలే గిరాకీ..

13 Jan, 2020 11:45 IST|Sakshi

దేశంలో స్టెమ్‌ కోర్సుల హవా

ముంబై: దేశ వ్యాప్తంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌(స్టెమ్‌) కోర్సులకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. గత మూడేళ్లుగా ఈ కోర్సులకు విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఎక్కువ ఉద్యోగ నియామకాలు ఈ కోర్సులు అభ్యసించిన వారికే దక్కాయని తెలిపింది. స్టెమ్‌ కోర్సులు చేసిన వారికి 2016 నవంబరు నుంచి 2019 నవంబరు వర​కు 44 శాతం ఉద్యోగ నియామకాలు పెరిగాయని ఇండీడ్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. నివేదిక ప్రకారం..2016 నవంబరు నుంచి 2019 నవంబరు వర​కు ఇండీడ్‌ వెబ్‌సైట్‌లో జరిగిన పోస్టింగ్స్‌ ఆధారంగా నివేదిక రూపొందించారు.

దేశంలో స్టెమ్‌ కోర్సులకు భారీగా డిమాండ్‌ ఉందని, నియామకాల వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని ఇండీడ్‌ వెబ్‌సైట్‌ డైరెక్టర్‌ వెంకట మాచవరపు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), రోబోటిక్స్‌ వంటి రంగాల్లో వస్తున్న అత్యాధునికి సాంకేతిక వల్ల విద్యార్థులు స్టెమ్‌ కోర్సుల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. ఈ కోర్సుల్లో నైపుణ్యం పెంచుకుంటే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు.

ఇండీడ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మొత్తం స్టెమ్‌ ఉద్యోగాల్లో ఢిల్లీ 31శాతం నియామకాలతో అగ్రస్థానంలో నిలవగా ముంబై (21శాతం), బెంగళూరు (14శాతం), పుణె (12శాతం), హైదరాబాద్‌ (12శాతం), చెన్నై (10శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రాంతాల వారిగా విశ్లేషిస్తే పశ్చిమ ప్రాంతాలు 34 శాతం ఉద్యోగాలతో అగ్రస్థానంలో నిలవగా, ఉత్తర, దక్షిణ రాష్ట్రాలు 31శాతం ఉద్యోగాలు పొందాయని..ఈశాన్య ప్రాంతాల్లో కేవలం 4శాతం ఉద్యోగాలకు మాత్రమే పరిమమితయ్యాయని నివేదిక తెలిపింది. విద్యార్థులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, పీహెచ్‌పీ డెవలపర్, నెట్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్ వంటి అత్యున్నత స్థాయి ఉద్యోగాలను అందిపుచ్చుకోవడానికి స్టెమ్‌ కోర్సులు నేర్చుకుంటున్నారని నివేదిక తెలిపింది.
 

>
మరిన్ని వార్తలు