ఎన్‌పీఏలుగా స్టెర్లింగ్‌ గ్రూప్‌ కంపెనీలు: ఆంధ్రాబ్యాంకు

13 Mar, 2018 01:03 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్టెర్లింగ్‌ గ్రూప్‌ కంపెనీలపై ఆర్‌బీఐతోపాటు సీబీఐకి ఫిర్యాదు చేసినట్టు ఆంధ్రాబ్యాంకు తెలిపింది. మోసపూరిత ఖాతాలుగా తెలుపుతూ, రూ.519.19 కోట్ల నిధులు దారి మళ్లించారని 2017 డిసెంబరులో ఇచ్చిన ఫిర్యాదులో తాము పేర్కొన్నట్టు వెల్లడించింది. ఈ గ్రూప్‌ కంపెనీలు 2015 మార్చి నుంచే ఎన్‌పీఏల ఖాతాలో చేరాయని బ్యాంకు తెలిపింది. డిసెంబరు 31 నాటికి రూ.515.19 కోట్ల ఫండ్‌ ఆధారిత రుణం ఎన్‌పీఏగా ఉందని వివరించింది.

రూ.5,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఆంధ్రాబ్యాంకు మాజీ డైరెక్టర్‌ అనుప్‌ ప్రకాశ్‌ గర్గ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అయితే అనుప్‌ ప్రకాశ్‌ 2006–09 మధ్య చార్టర్డ్‌ అకౌంటెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం అతను తమ ఉద్యోగి లేదా డైరెక్టర్‌ ఎంత మాత్రమూ కాదని ఆంధ్రాబ్యాంకు స్పష్టం చేసింది. స్టెర్లింగ్‌ గ్రూప్‌ కంపెనీలకు రుణం ఇచ్చిన కన్సార్షియంలో ఆంధ్రాబ్యాంకు లీడ్‌ బ్యాంకర్‌గా ఉంది.

ప్రస్తుతం ఈ కంపెనీలకు ఆంధ్రాబ్యాంకు ఇచ్చిన రుణంలో ఫండ్‌ ఆధారిత రుణం రూ.578.57 కోట్లు, నాన్‌ ఫండ్‌ ఆధారిత రుణం రూ.568.35 కోట్లు ఉందని, మీడియాలో వచ్చినట్టు రూ.5,000 కోట్లు కాదని వెల్లడించింది. తాజా వార్తల నేపథ్యంలో సోమవారం ఆంధ్రాబ్యాంకు షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 6.88 శాతం పడిపోయి రూ.35.85 వద్ద స్థిరపడింది.   

మరిన్ని వార్తలు