స్టెర్లింగ్‌ విల్సన్‌ - 8 రోజుల్లో 45% అప్‌

1 Jul, 2020 15:19 IST|Sakshi

తాజాగా 5 శాతం ప్లస్‌

యూఎస్‌ ప్రాజెక్ట్‌ ఎఫెక్ట్‌

రూ. 9048 కోట్ల ఆర్డర్‌బుక్‌

ఐపీవో ధర కంటే దిగువనే

ఇటీవల ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుల ఈపీసీ కంపెనీ స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. దీంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 215 ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది.  గత 8 రోజుల్లో ఈ కౌంటర్‌ 44 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌ కంపెనీ ఈ షేరు 2019 ఆగస్ట్‌లో లిస్టయ్యింది. షేరుకి రూ. 780 ధరలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టడం ద్వారా రూ. 3100 కోట్లు సమీకరించింది. ఇన్వెస్టర్ల రక్షణ నిమిత్తం స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఏర్పాటు చేసిన ఏఎస్‌ఎంలో భాగంగా  ఈ కౌంటర్‌కు 5 శాతం సర్క్యూట్‌ బ్రేకర్‌ను విధించినట్లు నిపుణులు పేర్కొన్నారు.

రూ. 750 కోట్ల ప్రాజెక్ట్‌
యూఎస్‌ అనుబంధ సంస్థ ద్వారా అమెరికాలో అతిపెద్ద సోలార్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు కాంట్రాక్ట్‌ పొందినట్లు గత వారాంతాన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ వెల్లడించింది.  9.9 కోట్ల డాలర్ల( దాదాపు రూ. 750 కోట్లు) విలువైన ఈ ఆర్డర్‌లో భాగంగా 194 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయవలసి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. 2020 నవంబర్‌ నుంచి ఏడాది కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసి ఉన్నట్లు వివరించింది. కాగా.. 2020 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌బుక్ విలువ వార్షిక ప్రాతిపదికన 15 శాతం పుంజుకుని రూ. 9048 కోట్లకు చేరింది. 

మరిన్ని వార్తలు