నోట్ల లెక్క ఇంకా తేలలేదు

12 Jul, 2017 20:22 IST|Sakshi
నోట్ల లెక్క ఇంకా తేలలేదు

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ ముగిసి ఆరు నెలలకు పైగా కావొస్తున్నా ఇంకా ఆ నోట్ల లెక్క తేలలేదు. డీమానిటైజేషన్‌ తర్వాత పాత నోట్లు ఎన్ని డిపాజిట్‌ అయ్యాయో ఇంకా లెక్కిస్తూనే ఉన్నామని రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేడు పార్లమెంట్‌ ప్యానెల్‌కు తెలిపారు. స్పెషల్‌ టీమ్‌ ఈ నోట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతుందని, వారంలో ఆరు రోజులు పనిచేస్తూ కేవలం ఆదివారం మాత్రమే సెలవు తీసుకుంటున్నట్టు పటేల్‌ చెప్పారు. నోట్ల రద్దు చేపట్టినప్పటి నుంచీ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

ఎన్ని రద్దైన నోట్లు మళ్లీ సిస్టమ్‌లోకి వచ్చాయని సమాజ్‌వాదీ పార్టీ నేత నరేశ్‌ అగర్వాల్‌, తృణమూల్‌ ఎంపీ సాగాటో రాయ్‌లు ఆర్బీఐ గవర్నర్‌ను ప్రశ్నించగా... గతేడాది నవంబర్‌న రూ.17.7 లక్షల కోట్లు చలామణిలో ఉంటే, ప్రస్తుతం రూ.15.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నట్టు పటేల్‌ తెలిపారు. గతేడాది నవంబర్‌ 8 ప్రధాని హఠాత్తుగా పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రద్దు చేసిన అనంతరం పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి డిసెంబర్‌ వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. అప్పటిలోగా దేశంలో ఉన్న పాత కరెన్సీ నోట్లన్నంటిన్నీ బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసి, వాటిని కొత్త కరెన్సీలోకి మార్చుకోవాలని ఆదేశించింది.   

రద్దయిన నోట్లు ఇంకా నేపాల్ దేశం నుంచి‌, కోపరేటివ్‌ బ్యాంకుల నుంచి వస్తున్నాయని పటేల్‌ చెప్పారు. అంతేకాక పోస్టు ఆఫీసులు ఇంకా పాత నోట్లను ఆర్బీఐ వద్ద డిపాజిట్‌ చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు విషయంలో పటేల్‌ రెండోసారి పార్లమెంట్‌ ప్యానల్‌ ముందు హాజరయ్యారు. ప్యానల్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు లెక్కలు పార్లమెంటులో ప్రవేశపెడతామని పటేల్‌ చెప్పినట్టు తెలిసింది.

పార్లమెంట్‌ ప్యానల్‌కు అధినేతగా కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మొయిలీ ఉన్నారు. అంతకముందు రెండుసార్లు పటేల్‌కు ప్యానల్‌ సమన్లు జారీచేయగా.. ఆ కాలంలో ఆర్‌బీఐకు అత్యంత కీలకమైన ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఉన్నందున పటేల్‌ మినహాయింపు కోరారు. ఈ కమిటీ టాప్‌ ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులకు కూడా పెద్ద నోట్ల విషయంలో సమన్లు జారీచేసింది. దీని ప్రభావాన్ని తమ ముందు వెల్లడించాలని ఆదేశించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా