విదేశీ సంకేతాలవైపు చూపు...

18 Aug, 2014 00:49 IST|Sakshi
విదేశీ సంకేతాలవైపు చూపు...

న్యూఢిల్లీ: దేశీయంగా మార్కెట్లను ప్రభావితం చేయగల ప్రధాన అంశాలేవీ లేకపోవడంతో ఈ వారం విదేశీ పరిణామాలే కీలకంగా నిలవనున్నాయని స్టాక్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇరాక్- అమెరికా, ఉక్రెయిన్-రష్యా మధ్య గత వారంలో ఏర్పడ్డ యుద్ధ మేఘాలు, వాటి పరిణామాలు వంటి అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని తెలిపారు.

మరోవైపు దేశీయ స్టాక్స్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు, డాలరుతో మారకంలో రూపాయి కదలికల తీరు కూడా కీలకం కానున్నాయని వివరించారు. కాగా, విదేశీ పరిణామాలకు అనుగుణంగా కదులుతున్న ముడిచమురు ధరలకూ ప్రాధాన్యత ఉన్నదని చెప్పారు. దేశీయ చమురు అవసరాల్లో 80% వరకూ దిగుమతులపైనే ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల కదలికలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు.

 అక్కడక్కడే...
 ప్రాధాన్యత కలిగిన అంశాలేవీ లేని కారణంగా ఈ వారం ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ అక్కడక్కడే సంచరించే అవకాశమున్నదని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. వెరసి రానున్న సెషన్లలో నిఫ్టీకి 7,750 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనున్నదని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు పుంజుకోగలవని అంచనా వేశారు.

గడిచిన శుక్రవారం దేశీ మార్కెట్లకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సెలవు అయినప్పటికీ, ఆ రోజు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ట్రేడర్లు నిశితంగా పరిశీలిస్తారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌధరి చెప్పారు. ఈ ప్రసంగం ద్వారా మోడీ భవిష్యత్‌లో చేపట్టబోయే సంస్కరణల ప్రణాళికలను మార్కెట్లు అంచనా వేస్తాయన్నారు.

 బిజినెస్‌కు స్నేహపూర్వక వాతావరణం
 బిజినెస్‌కు స్నేహ పూర్వక వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు మోడీ ప్రసంగం స్పష్టం చేసిందని జిగ్నేష్ చెప్పారు. శుక్రవారం మోడీ ప్రకటించిన ఆర్థిక ఎజెండాలో తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన విషయం విదితమే. దీనిలో భాగంగా అంతర్జాతీయ ఇన్వెస్టర్లను దేశీ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. తద్వారా మేడిన్ ఇండియా విజన్‌ను ఆవిష్కరించారు.

 దీంతోపాటు పేదప్రజలకూ అభివృద్ధిలో భాగాన్ని కల్పించేలా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ప్రణాళికలను ప్రకటించారు. ఈ అంశాలతోపాటు, విదేశీ సంకేతాలను కూడా ఇన్వెస్టర్లు పరిగణిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆందోళనలు కాస్త ఉపశమించడంతో గత వారం చివర్లో చమురు ధరలు తగ్గడంతోపాటు, దేశీ మార్కెట్లు పురోగమించాయి.  

 పరిస్థితులు కుదురుకుంటే...
 ఇరాక్, ఉక్రెయిన్, మధ్యప్రాచ్యాలలో తలెత్తిన ఆందోళనలు మరింత తగ్గుముఖంపడితే సెంటిమెంట్‌కు జోష్ లభిస్తుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరి హద్దులవద్ద రష్యా యుద్ధ విమానాలు కవాతులు నిలి పివేయడం, మరో ఐదు రోజులమేర కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఒప్పందం కుదరడం వంటి అంశాలతో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు ఊపందుకున్నాయి. వారం మొత్తంమీద సెన్సెక్స్ 774 పాయింట్లు ఎగసి 26,103 పాయింట్ల వద్ద నిలవగా, నిఫ్టీ సైతం 223 పాయింట్లు జమ చేసుకుని 7,792 పాయింట్ల వద్ద స్థిరపడింది. 

మరిన్ని వార్తలు