చివర్లో కొనుగోళ్ల జోరు

11 Jun, 2020 05:49 IST|Sakshi

కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

వృద్ధిపై ఫిచ్‌ రేటింగ్స్‌ సానుకూల అంచనాలు

290 పాయింట్ల లాభంతో 34,247 వద్ద ముగిసిన సెన్సెక్స్‌

70 పాయింట్లు పెరిగి 10,116కు నిఫ్టీ

ఒక్కరోజు విరామం తర్వాత స్టాక్‌ మార్కెట్‌ మళ్లీ లాభపడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్‌ సూచీలు ఎగిశాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నా, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది. సెన్సెక్స్‌ మళ్లీ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,100 పాయింట్లపైకి ఎగబాకాయి. భారత వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గినా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9.5 శాతం మేర ఉండొచ్చన్న ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనాలు, ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గడం, కరోనా కేసులు పెరుగుతున్నా, కరోనా వైరస్‌బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం(రికవరీ రేటు 49 శాతానికి పెరిగింది)... సానుకూల ప్రభావం చూపించాయి.  సెన్సెక్స్‌ 290 పాయింట్ల లాభంతో 34,247 పాయింట్ల వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు ఎగసి 10,116 పాయింట్ల వద్ద ముగిశాయి. చివరి అరగంటలో కొనుగోళ్లు జోరుగా సాగాయి.

ఫెడ్‌ వ్యాఖ్యలు కీలకం... 
అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయాన్ని బుధవారం అర్థరాత్రి వెల్లడించనుండటంతో ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి.  లాక్‌డౌన్‌ తొలగించిన తర్వాత ఫెడ్‌ ప్రకటించనున్న తొలి వడ్డీరేట్ల నిర్ణయం కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేట్ల విషయంలో యథాతథ స్థితినే ఫెడ్‌ కొనసాగించగలదని అంచనాలున్నాయి. ఆర్థిక పరిస్థితులపై ఫెడరల్‌ రిజర్వ్‌ చేసే వ్యాఖ్యలు కీలకం కానున్నాయి.  
∙ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 8 శాతం లాభంతో రూ. 501 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. వరుసగా నాలుగో రోజూ  లాభపడింది.  
∙ దాదాపు 60కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, అరబిందో ఫార్మా, లుపిన్, ముత్తూట్‌ ఫైనాన్స్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు