రెండో రోజూ లాభాలు

13 Dec, 2019 03:11 IST|Sakshi

సానుకూల అంతర్జాతీయ సంకేతాలు

నెల గరిష్టానికి రూపాయి

సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభం

62 పాయింట్లు పెరిగి 11,972కు నిఫ్టీ

బ్యాంక్, వాహన షేర్ల దన్నుతో గురువారం స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను పెంచలేదు. వచ్చే ఏడాది కూడా రేట్లను పెంచకపోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని  ఫెడ్‌ పేర్కొంది. దీంతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ వరుసగా ఏడో రోజూ పుంజుకొని నెల గరిష్టానికి చేరడం కలసివచ్చింది.

దివాలా చట్టం, ఎన్‌బీఎస్‌ఎఫ్‌లకు ఊరటనిచ్చేలా క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌లో సవరణకు సంబంధించి కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు తీసుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. ఇంట్రాడేలో 300 పాయింట్ల మేర లాభపడ్డ సెన్సెక్స్‌ చివరకు 169 పాయింట్ల లాభంతో 40,582 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 11,972 పాయింట్ల వద్దకు చేరింది. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

అమెరికా–చైనాల మధ్య తక్షణం వాణిజ్య ఒప్పందం ఏదీ కుదరకపోయినా, ఈ నెల 15 నుంచి మొదలు కావలసిన సుంకాల విధింపు జాప్యమయ్యే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. షాంఘై సూచీ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లూ లాభపడ్డాయి.  టాటా మోటార్స్‌ 7 శాతం లాభంతో రూ.173వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన రెండో షేర్‌ ఇదే.  రూపాయి బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోయాయి. వరుసగా 5 రోజుల్లో 30% నష్టపోయిన యస్‌ బ్యాంక్‌ కోలుకుంది.  ఇంట్రాడేలో 13% ఎగసిన ఈ షేర్‌ చివరకు 6% లాభంతో రూ. 45.35 వద్ద ముగిసింది.

>
మరిన్ని వార్తలు