చల్లబడ్డ చమురు ధరలు

19 Sep, 2019 08:14 IST|Sakshi

స్వల్ప లాభాలు పుంజుకున్న రూపాయి

ఫెడ్‌ రేట్ల నేపథ్యంలో అప్రమత్తత 

83 పాయింట్ల లాభంతో 36,564కు సెన్సెక్స్‌

23 పాయింట్లు పెరిగి 10,841కు నిఫ్టీ  

ముడి చమురు ధరలు దిగిరావడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడంతో  స్టాక్‌ మార్కెట్‌ బుధవారం స్వల్ప లాభాలతో గట్టెక్కింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్ల నిర్ణయం బుధవారం రాత్రికి వెలువడనున్నందున మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొన్నది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 83 పాయింట్లు పెరిగి 36,564 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 10,841 పాయింట్ల వద్ద ముగిశాయి. చమురు ధరలు 1 శాతం మేర తగ్గాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఇంట్రాడేలో 52 పైసలు పుంజుకొని 71.26ను తాకింది.  

247 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌.... 
గత శనివారం సౌదీ అరేబియా ఆయిల్‌ ప్లాంట్లపై డ్రోన్‌ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల కారణంగా ఆ దేశపు రోజువారీ చమురు ఉత్పత్తిలో దాదాపు సగానికి గండి పడింది. అయితే దీంట్లో సగం మొత్తాన్ని రికవరీ చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది. దీంతో చమురు ధరలు 6 శాతం మేర దిగివచ్చాయి. మరోవైపు ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. నెలాఖరుకల్లా చమురు ఉత్పత్తి సాధారణ స్థాయికి రాగలదని సౌదీ అరేబియా చమురు మంత్రి పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల తర్వాత గానీ, తక్షణం గానీ చైనాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఒకింత జోష్‌నిచ్చింది.  

సెన్సెక్స్‌ లాభాల్లో ఆరంభమైంది. వెంటనే 232 పాయింట్లు లాభపడింది. ఆ తర్వాత ఆ లాభాలను పోగొట్టుకొని 15 పాయింట్ల మేర నష్టపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల బాట పట్టింది. స్వల్ప లాభాలతో పరిమిత శ్రేణిలో కదలాడింది. మొత్తం మీద రోజంతా 247 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.  

ఆయిల్, హోటల్, సిగరెట్ల  షేర్ల ర్యాలీ.... 
వాహన షేర్లు పరిమిత శ్రేణిలో కదలాడాయి. వాహనాలపై జీఎస్‌టీ తగ్గిస్తే, పన్ను వసూళ్లు తగ్గుతాయని, ఫలితంగా ద్రవ్యలోటు లక్ష్యం సాధించడం కష్టమవుతుందన్న అంచనాల కారణంగా వాహనాలపై జీఎస్‌టీను తగ్గించే అవకాశాల్లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు దిగిరావడంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు పెరిగాయి. హెచ్‌పీసీఎల్‌ 3.6 శాతం, బీపీసీఎల్‌ 3.6 శాతం, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 2.6 శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు ఫైవ్‌స్టార్‌ హోటళ్లపై జీఎస్‌టీని తగ్గించే అవకాశాలున్నాయన్న వార్తల కారణంగా హోటల్‌ షేర్లు  ఇంట్రాడేలో 15 శాతం వరకూ పెరిగాయి. హోటల్‌ లీలా వెంచర్, తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్, రాయల్‌ ఆర్చిడ్‌ హోటల్స్, ఈఐహెచ్‌ అసోసియేటేడ్‌ హోటల్స్, లెమన్‌ ట్రీ హోటల్స్, ఇండియన్‌ హోటల్స్‌ 3–5 శాతం లాభపడ్డాయి. ఎలక్ట్రానిక్‌ సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతి, పంపిణీ, అమ్మకాలను నిషేధిస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేయడంతో సిగరెట్ల షేర్లు 5.5 శాతం వరకూ పెరిగాయి. ఫెడ్‌ రేటు తగ్గించిన వెంటనే అమెరికా మార్కెట్లు ఒక శాతం వరకూ పడ్డాయి.  

చదవండి : టీవీ ధరలు దిగొస్తాయ్‌!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా