39,900 పాయింట్లపైకి సెన్సెక్స్‌

5 Jul, 2019 10:42 IST|Sakshi

ఆర్థిక సర్వేతో లాభాలు

స్టాక్‌ మార్కెట్‌ నాలుగో రోజూ ముందుకే

69 పాయింట్ల లాభంతో 39,908కు సెన్సెక్స్‌

30 పాయింట్లు పెరిగి 11,947కు నిఫ్టీ  

వృద్ధి ఐదేళ్ల కనిష్ట స్థాయి నుంచి రికవరీ అవుతోందన్న ఆర్థిక సర్వే అంచనాల కారణంగా వరుసగా నాలుగో రోజూ స్టాక్‌ మార్కెట్‌  లాభాల్లో ముగిసింది. రెండోసారి గద్దెనెక్కిన నరేంద్ర మోదీ మొదటి బడ్జెట్‌పై ఆశావహ అంచనాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ 24 పైసలు పెరగడం, ముడి చమురు ధరలు తగ్గడం  కలసివచ్చాయి. ఈ నెలలోనే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్లను తగ్గిస్తుందని, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లు కూడా ఇదే బాట నడుస్తాయనే అంచనాలతో ప్రపంచ మార్కెట్లు లాభపడడం సానుకూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్‌ 39,900 పాయింట్ల ఎగువున ఎగబాకినప్పటికీ, నిఫ్టీ కీలకమైన 11,950 పాయింట్ల దిగువునే ముగిసింది. సెన్సెక్స్‌ 69 పాయింట్లు లాభపడి 39,908 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,947 పాయింట్ల వద్దకు చేరాయి. అయితే ఈ వారంలో వర్షాలు అంతంతమాత్రంగానే కురవడంతో లాభాలు పరిమితమయ్యాయి. బ్యాంక్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ రంగ షేర్లు లాభపడ్డాయి. 

ఒడిదుడుకులుంటాయ్‌....
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ది సాధించగలమని ఆర్థిక సర్వే వెల్లడించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు ఒకింత జోష్‌నిచ్చింది. అయితే సెన్సెక్స్, నిఫ్టీలు కీలకమైన పాయింట్ల ఎగువున బ్రేక్‌ అవుటయ్యే స్థాయికి చేరేంత జోష్‌ ఇవ్వడంలో ఆర్థిక సర్వే విఫలమైందని నిపుణులు పేర్కొన్నారు. నేడు బడ్జెట్‌ సందర్భంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయని విశ్లేషకులంటున్నారు. వృద్ధికి దోహదపడే చర్యలే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయని, ఈ అంచనాలు ఫలిస్తే, నిఫ్టీ 12,000–12,100 పాయింట్ల నిరోధ స్థాయిని దాటేస్తుందని వారంటున్నారు. ఆర్థిక సర్వే నేపథ్యంలో గురువారం సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. దేశీయ, అంతర్జాతీయ అంశాలు సానుకూలంగా ఉండటంతో రోజంతా లాభాలు కొనసాగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 140 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్ల మేర లాభపడ్డాయి. 

ఐదేళ్ల కనిష్టానికి యస్‌బ్యాంక్‌
యస్‌బ్యాంక్‌ షేర్‌ నష్టాలు కొనసాగుతున్నాయి. ఈ షేర్‌ 4 శాతం నష్టంతో రూ.95 వద్ద ఐదేళ్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 3.5 శాతం నష్టంతో రూ.96 వద్ద ముగిసింది. అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థలు యూబీఎస్, మూడీస్‌ సంస్థలు ఈ బ్యాంక్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడంతో ఈ షేర్‌ పతనమవుతోంది. ఒక్క నెల కాలంలోనే ఈ షేర్‌ 35 శాతానికి పైగా క్షీణించింది.  
పుణేలో మూడు ప్రాజెక్ట్‌లను సాధించడంతో రియల్టీ సంస్థ, కోల్టే పాటిల్‌ షేర్‌ 6 శాతం లాభంతో రూ.233 వద్ద ముగిసింది.  
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ షేర్‌ పతనం కొనసాగుతోంది. 5% లోయర్‌ సర్క్యూట్‌తో రూ.29.80 వద్ద ముగిసింది.
స్టాక్‌ మార్కెట్‌ లాభపడినప్పటికీ, దాదాపు 150 షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలను తాకాయి. యస్‌బ్యాంక్, థామస్‌ కుక్‌ ఇండియా, క్వెస్‌ కార్పొ, పీసీ జ్యూయలర్, గ్లాక్సోస్మిత్‌లైన్‌ ఫార్మా, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు 40కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్‌బీఐ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, అదానీ పవర్, బజాజ్‌ ఫైనాన్స్, ఒబెరాయ్‌ రియల్టీ, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.   

ఇండియామార్ట్‌ లిస్టింగ్‌ అదరహో
ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూధర,రూ.973తో పోల్చితే 21 శాతం లాభంతో ఈ షేర్‌ బీఎస్‌ఈలో రూ. 1,180 ధర వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 38 శాతం లాభంతో రూ.1,339 వద్ద గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్‌ చివరకు 34 శాతం లాభంతో రూ.1,302 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 6.8 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 75 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ ఐపీఓ 62 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. 

>
మరిన్ని వార్తలు