మార్కెట్‌కు ఒడిదుడుకుల వారం!

25 May, 2020 02:03 IST|Sakshi

గురువారం మే సిరీస్‌ ఎఫ్‌ అండ్‌ ఓ ముగింపు

ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం

హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, లుపిన్, టీవీఎస్‌ మోటార్, వోల్టాస్‌ ఫలితాలు ఈవారంలోనే..

ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, దేశీ కంపెనీల క్యూ4 ఫలితాలు, కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల ప్రకటనల వంటి కీలక అంశాలు ఈ వారంలో స్టాక్‌ మార్కెట్‌ దిశను నిర్దేశించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి విషయంలో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదిరితే మాత్రం భారీ పతనం తప్పదని కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, ఫండ్‌ మేనేజర్, ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ షిబాని సిర్కార్‌ కురియన్‌ అన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రతికూల వార్తలు వెలువడినా మార్కెట్‌కు ప్రతికూలంగా మారే అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

బ్యాంకింగ్, ఫైనాన్స్‌ రంగాల్లో ఇప్పటికే ఓవర్‌సోల్డ్‌ అధికంగా ఉన్న కారణంగా రిబౌండ్‌కు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వీపీ అజిత్‌ మిశ్రా విశ్లేషించారు. అయితే, ఇది అధికస్థాయిలో నిలవలేకపోవచ్చని, ఒడిదుడుకులకు ఈవారంలో ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు చెప్పారు. రంజాన్‌ పర్వదినం నేపథ్యంలో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగు రోజులే జరగనుంది. కాగా గురువారం (28న) మే నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) సిరీస్‌ ముగియనుంది. మరోవైపు.. హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, లుపిన్, డాబర్, టీవీఎస్‌ మోటార్, యునైటెడ్‌ స్పిరిట్స్, వోల్టాస్, ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్, మాక్స్‌ ఫైనాన్షియల్, టోరెంట్‌ ఫార్మా, వీఐపీ ఇండస్ట్రీస్, కేపీఐటీ టెక్నాలజీస్, ఈక్విటాస్‌ హోల్డింగ్స్, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, ఉషా మార్టిన్‌ కంపెనీలు తమ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి.

రూ. 9,089 కోట్ల పెట్టుబడి
భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మే 1–22 మధ్య కాలంలో రూ. 9,089 కోట్లను పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడైంది. ఏప్రిల్‌లో రూ. 6,883 కోట్లు, మార్చిలో రూ. 61,973 కోట్లను వెనక్కు తీసుకున్న విషయం తెలిసిందే.

నేడు మార్కెట్‌ సెలవు
రంజాన్‌ పర్వదినం సందర్భంగా సోమవారం (మే25న) దేశీ స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు సెలవు. మంగళవారం (26న) మార్కెట్‌ యథావిధిగా పని చేస్తుంది.

మరిన్ని వార్తలు