మార్కెట్‌కు ఫలితాల ఊతం..

22 Jan, 2019 01:01 IST|Sakshi

సెన్సెక్స్‌ 192 పాయింట్లు అప్‌

ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ తోడ్పాటు

కంపెనీలు ప్రకటిస్తున్న మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశావహంగా ఉంటున్న నేపథ్యంలో స్టాక్‌మార్కెట్ల లాభాల పరుగు కొనసాగుతోంది. దేశీ సూచీలు వరుసగా అయిదో సెషన్లో కూడా లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 192 పాయింట్లు పెరిగి 36,579 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల పెరిగి 10,962 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ కీలకమైన 36,700 మార్కును దాటి 36,701 పాయింట్ల స్థాయిని కూడా తాకింది. కనిష్టంగా 36,352 పాయింట్లకి కూడా పడిపోయి చివరికి 36,579 వద్ద క్లోజయ్యింది. అటు నిఫ్టీ ఇంట్రాడేలో 11,000కు మరింత చేరువగా పరుగులు తీసింది. ఒక దశలో 10,987 పాయింట్ల గరిష్ట స్థాయిని కూడా తాకింది. ఐటీ, టెక్నాలజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లు..సూచీలకు ఊతంగా నిల్చాయి. దిగ్గజ సంస్థలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మొదలైనవి గత వారం అంచనాలు మించి క్యూ3 ఫలితాలు ప్రకటించడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆశావహంగా ఉందని ట్రేడర్లు తెలిపారు. సోమవారం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆసాంతం అదే ధోరణిలో కొనసాగాయని ఆషికా గ్రూప్‌ ఈక్విటీ రీసెర్చ్‌ విభాగం ప్రెసిడెంట్‌ పారస్‌ బోత్రా చెప్పారు.

అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించి సంధి కుదరొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడమే ఇందుకు దోహపడిందని వివరించారు. మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న కంపెనీలపై ఇన్వెస్టర్లు ఆశావహంగా ఉన్నారని సాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ చెప్పారు. ఈ ఏడాది స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నా, అంతిమంగా మాత్రం కంపెనీల ఆదాయాలు, ఫండమెంటల్సే షేర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. 

రిలయన్స్‌ 4 శాతం అప్‌..: రికార్డు స్థాయిలో రూ. 10,000 కోట్ల లాభాలు ప్రకటించిన రిలయన్స్‌ షేరు సెన్సెక్స్‌లో 4.36 శాతం ఎగిసింది. అదే విధంగా డిసెంబర్‌ క్వార్టర్‌లో 20 శాతం లాభం నమోదు చేసిన ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 0.72 శాతం పెరిగి రూ. 2,146 వద్ద క్లోజయ్యింది. బీఎస్‌ఈలో 1.80 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 43 లక్షలు షేర్లు చేతులు మారాయి. తమపై జరుగుతున్న దుష్ప్రచారంపై విచారణ జరపాలంటూ సెబీని కోరిన దరిమిలా.. సన్‌ ఫార్మా షేర్లు ఓపెనింగ్‌లో 1.94 శాతం మేర పెరిగాయి. 

ఈ నెల 29 నుంచి ఓఎన్‌జీసీ బైబ్యాక్‌
ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ కార్యక్రమం ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల 11న ముగుస్తుంది. రూ.4,022 కోట్లతో వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఈ నిధులను అంతర్గత వనరుల నుంచి సమకూర్చుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుకు రూ.159 చొప్పున మొత్తం రూ.25.29 కోట్ల షేర్లు (మొత్తం వాటాల్లో 1.97 శాతం) బైబ్యాక్‌ చేయాలని ఓఎన్‌జీసీ బోర్డు గత డిసెంబర్‌ 20న నిర్ణయం తీసుకుంది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 65.64 శాతం వాటా ప్రస్తుతానికి ఉంది. దీంతో బైబ్యాక్‌లో కేంద్ర ప్రభుత్వం తన వాటాల్లో కొంత  మేర విక్రయించడం ద్వారా రూ.2,640 కోట్ల మేర నిధులను సమకూర్చుకునే అవకాశం ఉంది. ‘‘వాటాదారులు, కంపెనీ పరస్పర ప్రయోజనాలను పరిశీలించిన అనంతరం 1.97 శాతం వాటాకు సమానమైన రూ.25.59 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది’’ అని ఓఎన్‌జీసీ తెలిపింది. 

మరిన్ని వార్తలు