కొనసాగిన సుంకాల నష్టాలు

22 Jun, 2018 01:10 IST|Sakshi

పతన బాటలోనే ప్రపంచ మార్కెట్లు  

కొనసాగుతున్న విదేశీ అమ్మకాలు  

115 పాయింట్లు  పతనమై 35,432కు సెన్సెక్స్‌ 

31 పాయింట్ల   నష్టంతో 10,741కు నిఫ్టీ  

వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల పతనం ప్రభావం చూపడంతో గురువారం మన స్టాక్‌ మార్కెట్‌ నష్టపోయింది. దేశీయంగా నిశ్చయాత్మకమైన సంకేతాలేవీ లేకపోవడంతో అరకొరగా ఉన్న ఆరంభ లాభాలు కూడా ఆవిరయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, రూపాయి బలహీనత, చమురు ధరలపై ప్రభావం చూపించే కీలకమైన ఒపెక్‌ సమాశం నేడు(శుక్రవారం) జరగనుండడం...తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 115 పాయింట్ల నష్టంతో 35,432 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 10,741  పాయింట్ల వద్ద ముగిశాయి.  బ్యాంక్, లోహ, వాహన, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది.  అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి.  

ద్రవ్యోల్బణ ఆందోళనలు: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాల్లో అనిశ్చితి కారణంగా ఆసియా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ట్రేడయ్యాయి. సుంకాల పోరులో తాజాగా భారత్‌ కూడా చేరింది. అమెరికా నుంచి దిగుమతయ్యే 24 కోట్ల డాలర్ల విలువైన 30 రకాల వస్తువులపై భారత్‌ సుంకాలు విధించింది.  బుధవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెల్లడైన ఆర్‌బీఐ పాలసీ సమావేశ వివరాలు ఇన్వెస్టర్లను మరింతగా ఆందోళన పరిచాయి.  క్రూడ్‌ ధరలు పెరుగుతుండటం, అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో భారత్‌లో ద్రవ్యోల్బణ  పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయన్న ఆర్‌బీఐ అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 132 పాయింట్లు లాభపడినప్పటికీ,  ఆ తర్వాత 150 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద 282 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  వాణిజ్య ఉద్రిక్తతలు మరింతగా ముదరడంతో స్టాక్‌ మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ పేర్కొన్నారు. 

రిలయన్స్‌ జోరు: స్టాక్‌ సూచీలు ఒడిదుడుకుల్లో ట్రేడవుతున్నా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రోజూ కొత్త గరిష్టాలకు చేరుతోంది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,032ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 1.2 శాతం లాభంతో రూ.1,032 వద్ద ముగిసింది. ఇది ఆల్‌ టైమ్‌ క్లోజింగ్‌ హై.గత ఏడాది కాలంలో ఈ షేర్‌ 45 శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌కు కొత్త చైర్మన్‌గా గతంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు సీఎమ్‌డీగా పనిచేసిన ఎమ్‌డీ మాల్యా నియమితులు కానున్నారన్న వార్తల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 1.4 శాతం లాభంతో రూ.298 వద్ద ముగిసింది. బ్యాంక్‌  ఆఫ్‌ బరోడా 2 శాతం నష్టంతో రెండేళ్ల కనిష్టానికి, రూ.122కు పడిపోయింది. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ సీఎమ్‌డీ అరెస్ట్‌ కారణంగా ఈ షేర్‌ ఇంట్రాడేలో 7 శాతం వరకూ నష్టపోయింది. చివరకు 1.1 శాతం నష్టంతో రూ.13.31 వద్ద ముగిసింది.  
ఏడాది కనిష్టానికి సిమెంట్‌ షేర్లు   డిమాండ్‌ పుంజుకోవడం మరింత ఆలశ్యం కావచ్చన్న అంచనాల కారణంగా సిమెంట్‌ షేర్లు తాజా ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్, అంబుజా సిమెంట్, ఏసీసీ, జేకే సిమెంట్స్, శ్రీ సిమెంట్, ఇండియా సిమెంట్స్, పాణ్యం సిమెంట్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

 

మరిన్ని వార్తలు