ఆగని పతనం 

20 Sep, 2018 01:00 IST|Sakshi

11,250 దిగువకు నిఫ్టీ  

45 పాయింట్లు పతనమై 11,234కు వద్ద ముగింపు  

169 పాయింట్ల నష్టంతో  37,121కు సెన్సెక్స్‌

రూపాయి రికవరీ అయినా, బుధవారం స్టాక్‌ మార్కెట్‌ పతనం ఆగలేదు. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా స్టాక్‌ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. మధ్యాహ్నం దాకా మంచి లాభాల్లో ఉన్న మార్కెట్‌ ఆ తర్వాత భారీగా నష్టపోయింది. నిఫ్టీ కీలకమైన 11,250 పాయింట్ల దిగువకు పతనమయ్యింది.  ట్రేడింగ్‌ చివర్లో కొంత రికవరీ చోటు చేసుకోవడంతో స్టాక్‌ మార్కెట్‌ ఓ మోస్తరు నష్టాలతో గట్టెక్కింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  169 పాయింట్లు నష్టపోయి 37,121 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 11,234 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది రెండు నెలల కనిష్ట స్థాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 970 పాయింట్లు నష్టపోయింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, వాహన, బ్యాంక్, ఆర్థిక  షేర్లు పతనమయ్యాయి. లోహ షేర్లు లాభపడ్డాయి.  

హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం నష్టం వంద పాయింట్లు... అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా అంచనా వేసిన స్థాయిలో  చైనా సుంకాలను విధించకపోవడంతో  ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఈ రెండు అంశాల కారణంగా మధ్యాహ్నం దాకా స్టాక్‌ సూచీలు లాభాల్లో సాగాయి. కానీ ముడి చమురు ధరలు భగ్గుమనడం ప్రతికూల ప్రభావం చూపించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1.8 శాతం వరకూ నష్టపోయాయి. సెన్సెక్స్‌ మొత్తం 169 పాయింట్ల నష్టంలో ఈ రెండు షేర్ల వాటాయే 107 పాయింట్ల వరకూ ఉంది.  

మూడు రోజుల్లో రూ.3.62 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్‌ మూడు రోజుల వరుస నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.3.62 లక్షల కోట్లు ఆవిరైంది. ఈ మూడు రోజుల్లో సెన్సెక్స్‌ మొత్తం 970 పాయింట్లు పతనమైంది. ఇన్వెస్టర్ల సంపదగా వ్యవహరించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.3,62,357 కోట్లు హరించుకుపోయి రూ.1,52,73,265 కోట్లకు పడిపోయింది.  

►నేడు మార్కెట్‌కు సెలవు మొహర్రం  సందర్భంగా  నేడు (గురువారం)  స్టాక్, ఫారెక్స్, మనీ మార్కెట్లకు సెలవు.   

మరిన్ని వార్తలు