కొనసాగుతున్న రికార్డ్‌లు

31 Jul, 2018 01:11 IST|Sakshi

మార్కెట్‌కు ఫలితాల కిక్‌ 

ఇంట్రాడే, ముగింపులో కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు  

157 పాయింట్ల లాభంతో 37,494కు సెన్సెక్స్‌ 

41 పాయింట్లతో 11,320కు నిఫ్టీ

కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించుతుండటంతో స్టాక్‌ మార్కెట్లో రికార్డ్‌ల పరంపర కొనసాగుతోంది. సోమవారం స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను నెలకొల్పాయి. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, మన మార్కెట్లో కొనుగోళ్ల  జోరు కారణంగా ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,500 పాయింట్లను, నిఫ్టీ 11,300 పాయింట్లను అధిగమించాయి. వరుసగా ఆరో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ సెన్సెక్స్‌ రికార్డ్‌లు నెలకొల్పింది. సెన్సెక్స్‌ 157 పాయింట్ల లాభంతో 37,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 41 పాయింట్ల లాభంతో 11,320 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 37,534 పాయింట్లు, నిఫ్టీ 11,328 పాయింట్లను తాకాయి. ఇవి ఆయా సూచీలకు జీవిత కాల గరిష్ట స్థాయిలు. గత ఆరు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ 997 పాయింట్లు పెరిగింది. ప్రభుత్వ రంగ బ్యాంక్, లోహ, ఫార్మా, ఎనర్జీ, వాహన, టెలికం షేర్లు లాభపడ్డాయి. ఐటీ షేర్లు డీలా పడ్డాయి.  

సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో మన మార్కెట్లో కూడా ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి ఒక దశలో సెన్సెక్స్‌ 44 పాయింట్లు పతనమై ఇంట్రాడేలో 37,292 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. కొనుగోళ్ల జోరుతో మళ్లీ లాభాల బాట పట్టింది. ఒక దశలో 197 పాయింట్ల లాభంతో 37,534 పాయింట్ల వద్ద ఆల్‌ టైమ్‌ హైని తాకింది.  రిటైల్, టెలికం వ్యాపారాల జోరుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ క్యూ1లో అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేసింది. దీంతో ఈ షేర్‌ సోమవారం ఆల్‌టైమ్‌ హై, రూ.11,58ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.1,149.70 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12,749 కోట్లు పెరిగి రూ.7,28,508 కోట్లకు చేరింది.  ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. నికర లాభం రెండు రెట్లకు పైగా పెరగడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్‌ 10 శాతం లాభంతో రూ.152 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ ఒక్కరోజులోనే రూ.3,625 కోట్లు పెరిగి రూ.40,146 కోట్లకు ఎగసింది.  పదేళ్ల కాలంలో తొలిసారిగా నష్టాలు వచ్చినప్పటికీ, ఐసీఐసీఐ బ్యాంక్‌ 5 శాతం లాభంతో రూ.307 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8,991 కోట్లు పెరిగి రూ.1,97,633 కోట్లకు చేరింది.  

పేలవంగా లిస్టింగ్‌... 
టీసీఎన్‌ఎస్‌ క్లోధింగ్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ పేలవంగా ముగిసింది. ఇష్యూ ధర రూ.716తో పోల్చితే ఫ్లాట్‌గా రూ.715 వద్ద ఈ షేర్‌ బీఎస్‌ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 12 శాతం నష్టంతో రూ.627 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 8 శాతం నష్టంతో రూ.658 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసే నాటికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.4,034 కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈలో 13.31 షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి.  క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.1,000 కోట్లు సమీకరిస్తుందని అంచనా.   

>
మరిన్ని వార్తలు