కొత్త శిఖరాలకు స్టాక్‌ సూచీలు

27 Jul, 2018 00:33 IST|Sakshi

అంచనాలను మించుతున్న క్యూ1 ఫలితాలు 

దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరు

ప్రోత్సాహకరంగా అంతర్జాతీయ సంకేతాలు 

కలసివచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు 

వారం గరిష్టానికి రూపాయి 

ఇంట్రాడే, ముగింపుల్లో సెన్సెక్స్, నిఫ్టీల కొత్త రికార్డ్‌

దలాల్‌ స్ట్రీట్‌ రికార్డ్‌ల జోరుతో దద్దరిల్లుతోంది. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటంతో స్టాక్‌సూచీలు కొత్త శిఖరాలను చేరుతున్నాయి. అంతర్జాతీయ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉండటం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా కొనసాగుతుండటం కలసివస్తోంది. వరుసగా నాలుగో రోజూ సెన్సెక్స్‌ కొత్త రికార్డ్‌లను సృష్టించింది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను తిరగరాశాయి. సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారిగా 37,000 పాయింట్ల మైలురాయిని దాటేసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 126 పాయింట్ల లాభంతో 36,985 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,167 పాయింట్ల వద్ద ముగిశాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 203 పాయింట్ల లాభంతో 37,062 పాయింట్ల వద్ద,   నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 11,186 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 507 పాయింట్లు పెరిగింది.  స్టాక్‌ సూచీలు లాభాల్లో ఆరంభమయ్యాయి.

అంచనాలను మించిన ఫలితాల జోష్‌తో కొత్త రికార్డ్‌లకు ఎగబాకాయి. జూలై సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు కారణంగా మధ్యాహ్నం తర్వాత ఒకింత ఒడుదుడుకులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ షేర్ల దన్నుతో  చివరకు రికార్డ్‌ స్థాయిల్లోనే ముగిశాయి. కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించుతుండటం, దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు జోరుగా కొనసాగుతుండటంతో స్టాక్‌ మార్కెట్లో సెంటిమెంట్‌ బలపడుతూ వస్తోందని నిపుణులంటున్నారు. జూలై సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో షార్ట్‌ పొజిషన్ల కవరింగ్‌ కొనుగోళ్లు జరగడం, రూపాయి బలపడటం కూడా కలసివచ్చాయి. జీఎస్‌టీ రేట్లు తగ్గడం, వర్షాలు బాగా కురుస్తుండటం సానుకూల ప్రభావం చూపుతున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ చెప్పారు.  

బ్యాంక్‌ షేర్ల జోరు...: బుధవారం వెలువడిన కెనరా బ్యాంక్‌ ఫలితాలు అంచనాలను మించడం, షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లతో గురువారం బ్యాంక్‌ షేర్లు జోరుగా పెరిగాయి. ఎస్‌బీఐ 5.6 శాతం లాభంతో రూ.287 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 5.2 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 4 శాతం, పీఎన్‌బీ 2 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.8 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.7 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8.4 శాతం, కెనరా బ్యాంక్‌ 7.7 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 7 శాతం, అలహాబాద్‌ బ్యాంక్‌ 3.7 శాతం, ఆంద్రా బ్యాంక్‌ 2.8 శాతం, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ 2.2 శాతం, కార్పొరేషన్‌ బ్యాంక్‌ 2 శాతం చొప్పున పెరిగాయి.  

∙స్టాక్‌ సూచీలతో పాటు పలు షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్, బాటా ఇండియా, గోద్రేజ్‌ కన్సూమర్, హావెల్స్‌ ఇండియా, ఇండియాబుల్స్‌ వెంచర్స్, ఫైజర్, టాటా ఎలెక్సీ, వీఐపీ ఇండస్ట్రీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  

∙ప్రైవేట్‌ బ్యాంక్‌లు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీల కారణంగా నిఫ్టీ ఆల్‌టైమ్‌ హైను తాకింది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యస్‌ బ్యాంక్, బజాజ్‌ ఫైనాన్స్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఏషియన్‌ పెయింట్స్, హిందుస్తాన్‌ యూనిలివర్, ఐటీసీ షేర్లు గత ఆరు నెలల కాలంలో 5 శాతం వరకూ పెరిగాయి.  

∙సంప్రదింపుల ద్వారా వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవాలని అమెరికా, యూరోపియన్‌  యూనియన్‌లు అంగీకారానికి రావడంతో యూరప్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఇటు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.   

∙స్టాక్‌ సూచీలు సరికొత్త రికార్డ్‌లను చేరినప్పటికీ, 70కి పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు