ఆగని రికార్డుల హోరు

9 Aug, 2018 01:48 IST|Sakshi

ఇంట్రాడేలోనూ,  ముగింపులోనూ కొత్త రికార్డ్‌లు

222 పాయింట్ల లాభంతో 37,888కు సెన్సెక్స్‌

61 పాయింట్లతో 11,450కు నిఫ్టీ  

స్టాక్‌ మార్కెట్లో రికార్డ్‌ల పరంపర కొనసాగుతోంది. బుధవారం మళ్లీ స్టాక్‌ సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డ్‌లను సాధించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ తొలిసారిగా 37,900 పాయింట్ల పైకి ఎగబాకగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తొలిసారిగా 11,450 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ జీవిత కాల గరిష్ట స్థాయి వద్ద ముగియడం విశేషం. బ్యాంక్‌ నిఫ్టీ కూడా తొలిసారిగా 28,000 పాయింట్లను దాటి, ఆ పైన ముగియగలిగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 37,888 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 11,450 పాయింట్ల వద్దకు చేరాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ప్రైవేట్‌ బ్యాంక్‌ షేర్ల లాభాల కారణంగా సెన్సెక్స్‌ ఈ స్థాయి లాభాలు సాధించింది. మధ్యాహ్నం తర్వాత బ్యాంక్, ఇంధన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. వాహన, ఫార్మా సూచీలు మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. సెన్సెక్స్‌  ఈ ఏడాది ఇప్పటికే 22 సార్లు రికార్డ్‌లను సాధించింది. 

కిక్‌నిచ్చిన ఐఎమ్‌ఎఫ్‌ కితాబు... 
రానున్న దశాబ్దాల్లో అంతర్జాతీయ వృద్ధికి భారత్‌ ఇతోధికంగా తోడ్పాటునందించగలదన్న అంతర్జాతీయ ద్రవ్యనిధి కితాబు మన మార్కెట్‌కు కిక్‌ని ఇచ్చింది. దీంతో కొనుగోళ్లు జోరుగా సాగాయి.   రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ కూడా ఆల్‌టైమ్‌ హై, రూ.1,222ను తాకింది. చివరకు 2.8 శాతం లాభంతో రూ.1,217 వద్ద ముగిసింది. ఈ షేర్‌ఈ ఏడాది ఇప్పటివరకూ 37 శాతం ఎగసింది. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంలో ఈ షేర్‌ వాటా 65 పాయింట్ల వరకూ ఉంది. షేర్‌ జోరుతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.7,71,450 కోట్లకు చేరింది. దీంతో అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కంపెనీగా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.    

మరిన్ని వార్తలు