చివర్లో కొనుగోళ్లతో లాభాలు

5 Feb, 2019 03:57 IST|Sakshi

మూడో రోజూ పెరిగిన మార్కెట్‌

గట్టెక్కించిన బ్లూచిప్‌ షేర్లు

 113 పాయింట్ల లాభంతో 36,583కు సెన్సెక్స్‌

19 పాయింట్లు పెరిగి10,912కు నిఫ్టీ  

చివరి గంటలో బ్లూ చిప్‌ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం లాభాలతో గట్టెక్కింది. ఇంట్రాడేలో 244 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ చివరకు 113 పాయింట్ల లాభంతో 36,583 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 10,912 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్‌సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడ్డాయి.  

398 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌  
సెన్సెక్స్‌ స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించింది.  అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ బలం పుంజుకోవడంతో రూపాయి ఇంట్రాడేలో 43 పైసలు పతనం కావడం, ముడి చమురు ధరలు భగ్గుమనడం ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇంట్రాడేలో 244 పాయింట్లు పతనమైంది. చివరి గంటలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఓఎన్‌జీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వంటి బ్లూచిప్‌ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో లాభాల్లోకి వచ్చిన సెన్సెక్స్‌ ఒక దశలో 154 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 398 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ ఒక దశలో 80 పాయింట్లు నష్టపోగా, మరో దశలో 34 పాయింట్లు పెరిగింది.  

►రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 3.5 శాతం లాభపడి రూ.1,291 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నా, ఆర్‌ఐఎల్‌ ఈ స్థాయిలో పెరగడం వల్ల సెన్సెక్స్‌ లాభపడింది.  


►దివాలా కోసం దరఖాస్తు చేయడంతో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్‌ 35 శాతం పతనమై రూ.7.55 వద్ద ముగిసింది.  ఈ షేర్‌తో పాటు అనిల్‌ అంబానీ గ్రూప్‌ కంపెనీలు ...రిలయన్స్‌ క్యాపిటల్, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్, తదితర ఏడు షేర్లు 3–35% రేంజ్‌లో పతనమయ్యాయి.   

►వ్యూహాత్మక భాగస్వామి కోసం అన్వేషిస్తున్నామని డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వెల్లడించడంతో ఐదు రోజుల నష్టాల అనంతరం ఈ షేర్‌ లాభపడింది. ఇంట్రాడేలో 97కు పడిపోయిన ఈ షేర్‌ ఆ తర్వాత కోలుకుని 4.1 శాతం పెరిగి రూ.116 వద్ద ముగిసింది.  

►ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో టైటాన్‌ షేర్‌ 3.4 శాతం లాభపడి రూ.1,026 వద్ద, దివీస్‌ ల్యాబ్స్‌ 5 శాతం లాభంతో రూ.1,610 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి.
 
కోల్‌ ఇండియా బైబ్యాక్‌ ధర రూ.235 
  రూ. 10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.234 ధరకు మొత్తం 4.46 కోట్ల ఈక్విటీ షేర్లను ౖకోల్‌ ఇండియా బెబ్యాక్‌ చేయనున్నది. ఈ బైబ్యాక్‌ కోసం ఈ కంపెనీ రూ.1,050 కోట్లు కేటాయించింది. . ఈ షేర్ల బైబ్యాక్‌కు రికార్డ్‌ డేట్‌ ఈ నెల 15.

ఐపీఓకు ఎమ్‌ఎస్‌టీసీ! 
ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 25% వాటా షేర్లు విక్రయం 
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎమ్‌ఎస్‌టీసీ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతోంది. ఈ మేరకు ఐపీఓ పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఈ మధ్యే సమర్పించింది. ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 25 శాతం వాటాకు సమానమైన 1.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించనుంది. ప్రస్తుతం సంస్థలో 89.85 శాతంగా ఉన్న ప్రభుత్వ వాటా ఐపీఓ అనంతరం 64.85 శాతానికి తగ్గుతుంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్‌గా ఈక్విరస్‌ క్యాపిటల్‌ వ్యవహరిస్తోంది. ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఎంఎస్‌టీసీ... బల్క్‌ రా మెటీరియల్‌ ట్రేడింగ్‌ను నిర్వహించడంతో పాటు ఈ–ఆక్షన్‌/ సేల్‌ తదితర ఈ –కామర్స్‌ సంబంధిత సేవలనందిస్తోంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.72 కోట్ల నికర లాభం సాధించింది. 

మరిన్ని వార్తలు