సుప్రీం, గణాంకాలపై దృష్టి

8 Sep, 2014 00:45 IST|Sakshi
సుప్రీం, గణాంకాలపై దృష్టి

న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కు సంబంధించి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు తెరలేవనుంది. గత రెండు దశాబ్దాలలో(1993 నుంచి 2010 వరకూ) వివిధ ప్రభుత్వాలు చేపట్టిన కేటాయింపులన్నీ అక్రమమేనంటూ ఇప్పటికే సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జరగనున్న  విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వారంలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వె ల్లడికానున్నాయి.

 ఈ అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని, దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూసే అవకాశాలున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బుల్లిష్ ధోరణిలో సాగుతున్న మార్కెట్లకు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో హియరింగ్ ప్రభావం మెటల్, పవర్ షేర్లపై కనిపిస్తుందని పేర్కొన్నారు.

 మరింత ముందుకు....
 జూలై నెలకు ఐఐపీ, ఆగస్ట్ నెలకు సీపీఐ గణాంకాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ మార్కెట్ల సంకేతాలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు వివరించారు. గడచిన వారంలో సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 27,027 వద్ద ముగిసింది.

ఒక దశలో 27,226 పాయింట్ల కొత్త గరిష్టానికి సైతం చేరింది. డెరివేటివ్ లావాదేవీలు, ట్రేడర్ల ఆసక్తి, బలపడ్డ సెంటిమెంట్ వంటి అంశాల ఆధారంగా ఈ వారంలోనూ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కొనసాగుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు కూడా ఇందుకు సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు.

 జీడీపీతో జోష్: ఈ ఏడాది తొలి క్వార్టర్‌లో జీడీపీ 5.7%కు పుంజుకోవడం గత వారంలో ఇన్వెస్టర ్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఐల పెట్టుబడులు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం చల్లబడటం వంటి అంశాలు దీనికి జతకలిశాయని చెప్పారు. ఇకపై ఐఐపీ, సీపీఐ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇంతక్రితం విడుదలైన ఈ గణాంకాల్లో వృద్ధి నమోదుకావడంతో వీటిపై సానుకూల అంచనాలున్నాయని తెలిపారు. కాగా, సాంకేతిక అంశాల ప్రకారం మార్కెట్లు మరింత పురోగమిస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ అంచనా వేశారు.

అయితే బొగ్గు క్షేత్రాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో పరిమాణాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు. గడచిన శుక్రవారం యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) పాలసీ రేట్లను తగ్గించడంతోపాటు, అదనపు సహాయక ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరిన్ని విదేశీ నిధులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు తరలి వస్తాయన్న అంచనాలు పెరిగాయని డీలర్లు చెప్పారు.

 తొలి వారం రూ. 9,000 కోట్ల పెట్టుబడులు
 దేశీ క్యాపిటల్ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ. 9,000 కోట్లను(150 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 3,972 కోట్లను(65.6 కోట్ల డాలర్లు) స్టాక్స్ కొనుగోలుకి వెచ్చించగా, రూ. 5,013 కోట్లను(82.8 కోట్ల డాలర్లు) బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు