స్టాక్స్‌ వ్యూ

20 Aug, 2018 01:03 IST|Sakshi

నాల్కో
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 69     టార్గెట్‌ ధర: రూ.108  
ఎందుకంటే: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ (నాల్కో) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఎబిటా 344 శాతం(సీక్వెన్షియల్‌గా చూస్తే 61 శాతం) వృద్ధితో రూ.1,010 కోట్లకు ఎగిసింది. అల్యూమినా ధరలు బాగా పెరగడం వల్ల ఈ కంపెనీ ఈ స్థాయి ఎబిటా సాధించింది. నికర లాభం 5 రెట్లు (సీక్వెన్షియల్‌గా 70 శాతం) పెరిగి రూ.630 కోట్లకు చేరింది. అల్యుమినా ఉత్పత్తి 11 శాతం వృద్ధితో 583 కిలో టన్నులకు పెరిగింది. ఒక క్వార్టర్‌లో ఇంత అత్యధిక స్థాయి ఉత్పత్తి సాధించడం ఈ కంపెనీకి ఇదే మొదటిసారి. అమ్మకాలు 24 శాతం తగ్గినా, రియలైజేషన్‌ 36 శాతం (సీక్వెన్షియల్‌గా) పెరిగి 562 డాలర్లకు (టన్నుకు) పెరిగింది. అల్యూమినియం ఉత్పత్తి 9 శాతం, అమ్మకాలు 18 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రపంచంలో అతి పెద్ద అల్యూమినా కంపెనీల్లో ఒకటైన నార్వేకు చెందిన నార్స్క్‌ హైడ్రో కొన్ని అల్యూమినా ప్లాంట్లను మూసేయడం, చైనా రిఫైనరీలు ఉత్పత్తిని నిలిపేయడం వల్ల అల్యూమినా ధరలు పెరుగుతున్నాయి. ఇది నాల్కో కంపెనీకి లాభిస్తోంది. నాల్కోకు విస్తారమైన బాక్సైట్‌ గనులు ఉండటం సానుకూలాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎబిటా 71 శాతం ఎగసి రూ.2,840 కోట్లకు, నికర లాభం 12 శాతం పెరిగి రూ.1,760 కోట్లకు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. 2012–13లో 5 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతానికి పెరగగలదని భావిస్తున్నాం. 

ఆయిల్‌ ఇండియా
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
కొనొచ్చు

ప్రస్తుత ధర: రూ. 204     టార్గెట్‌ ధర: రూ.314 
ఎందుకంటే: ఆయిల్‌ ఇండియా కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.3,390 కోట్లకు పెరిగింది. చమురు, గ్యాస్‌ రియలైజేషన్లు అధికంగా ఉండటమే దీనికి కారణం. ఒక్కో బ్యారెల్‌కు ఆయిల్‌ రియలైజేషన్‌ 55 శాతం వృద్ధితో రూ.4,823కు పెరిగింది. అలాగే గ్యాస్‌ రియలైజేషన్‌ 17 శాతం ఎగసింది. ముడిచమురు అమ్మకాలు 0.6 శాతం తగ్గినా, ఎబిటా 61 శాతం వృద్ధితో రూ.1,408 కోట్లకు చేరింది. గత క్యూ1లో 29 శాతంగా ఉన్న పన్ను రేటు ఈ క్యూ1లో 35 శాతానికి పెరిగినప్పటికీ, నికర లాభం 56 శాతం వృద్ధితో రూ.703 కోట్లకు పెరిగింది. ఈ క్యూ1లో ఎలాంటి సబ్సిడీ భారం లేదు.  బ్యారెల్‌ ముడిచమురు 80 డాలర్ల లోపు ఉన్నంత వరకూ ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు, ఆప్‌స్ట్రీమ్‌ కంపెనీలపై ఎలాంటి భారం ఉండదు. అయితే వంట గ్యాస్‌ విషయమై కొంత సబ్సిడీ భారం ఆప్‌స్ట్రీమ్‌ కంపెనీలపై ఉంటుంది.  ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, ఈ షేర్‌ ఈ ఏడాది జనవరిలో పైపైకి ఎగసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ, ఈ షేర్‌ 17 శాతం వరకూ తగ్గింది. ప్రస్తుత ధర కొనుగోళ్లకు ఆకర్షణీయమని భావిస్తున్నాం. డివిడెండ్‌ ఈల్డ్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5.7 శాతంగా ఉండొచ్చని అంచనా. అలాగే రెండేళ్లలో ఈపీఎస్‌ 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలదని భావిస్తున్నాం. సమ్‌ ఆఫ్‌ ద పార్ట్స్‌ ప్రాతిపదికన టార్గెట్‌ ధరను నిర్ణయించాం. చమురు ధరలు పెరిగితే సబ్సిడీ భారం పెరుగుతుంది. ఇది షేర్‌ ధరపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.   
 

మరిన్ని వార్తలు