వీడని కోవిడ్‌–19 వైరస్‌ భయాలు

6 Mar, 2020 08:25 IST|Sakshi

 సానుకూలంగానే అంతర్జాతీయ సంకేతాలు  

మన దగ్గర 30కు చేరిన కోవిడ్‌–19 వైరస్‌ కేసులు  

దీంతో ఆరంభ లాభాలు ఆవిరి  

61 పాయింట్ల లాభంతో 38,471కు సెన్సెక్స్‌  

18 పాయింట్లు పెరిగి 11,269కు నిఫ్టీ 

సాక్షి, ముంబై: కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ భయాలు వీడకపోవడంతో స్టాక్‌ మార్కెట్‌ గురువారం నష్టాల్లోనే ముగిసింది. వీక్లీ ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉన్నా, స్టాక్‌ సూచీలు స్వల్ప లాభాలతోనే గట్టెక్కాయి. ఇంట్రాడేలో 479 పాయింట్లు ఎగసిన  సెన్సెక్స్‌ చివరకు 61 పాయింట్ల లాభంతో 38,471 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 11,269  పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పుంజుకున్నా (ఇంట్రాడేలో), ఆ ప్రభావం కనిపించలేదు.  

501 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌  
ఆసియా మార్కెట్ల జోరుతో సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. రోజులో ఎక్కువ భాగం లాభాల్లోనే ట్రేడైంది. ఒక దశలో 479  పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ చివర్లో 22 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 501 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.  మన దేశంలో కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కేసులు 30కు పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు ఆరంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. కాగా భారత్‌ వంటి వర్థమాన దేశాల్లో కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ విద్వంసం తీవ్రంగానే ఉండగలదనే ఆందోళనతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారని నిపుణులంటున్నారు. టెలికం, బ్యాంక్‌ల మొండి బకాయిల సంబంధిత అంశాల కారణంగా సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయని వారంటున్నారు. కరోనా వైరస్‌ కల్లోలం కారణంగా ఏర్పడిన ఆర్థిక ప్రతికూలతలను ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా సమర్థవంతంగా ఎదుర్కొగలవన్న అశలతో ఆసియా మార్కెట్లు పెరిగాయి. 

అమెరికా మార్కెట్లు.. భారీ పతనం 
కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య అమెరికాలో 11కు చేరడం ఆ దేశ మార్కెట్లను భారీగా నష్టాల పాలు చేసింది. యూరప్‌ మార్కెట్లు 1–1.6% మేర నష్టపోగా, ఈ వార్త రాసే సమయానికి (రాత్రి గం.12.05) అమెరికా స్టాక్‌ సూచీలు 3–3.5 % నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 300 పాయింట్లు (2.67%) నష్టాల్లో ట్రేడవుతోంది. ఈ నష్టాలే కొనసాగితే, నేడు (శుక్రవారం) మన మార్కెట్‌కు  భారీగా నష్టాలు తప్పవని నిపుణులంటున్నారు.

మరిన్ని వార్తలు