ప్రపంచానికి ‘టర్కీ’ ఫీవర్‌!!

14 Aug, 2018 01:42 IST|Sakshi

అమెరికాతో కయ్యం... కరెన్సీ కుదేలు...

వారం రోజుల్లో 40 శాతం కుప్పకూలిన లీరా

కొంపముంచుతున్న అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఆర్థిక పాలసీలు

అమెరికా ఆంక్షలు, దిగుమతి సుంకాల దెబ్బ...

ఇది ఆర్థిక యుద్ధమేనంటూ విరుచుకుపడుతున్న ఎర్డోగన్‌

యూరప్‌లో ఇతర దేశాలకూ సంక్షోభం పాకొచ్చన్న ఆందోళనలు  

(సాక్షి, బిజినెస్‌ విభాగం) :  ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లన్నీ మంచి జోరుమీదున్న సమయంలో హఠాత్తుగా ‘టర్కీ’ ముసలం ఇన్వెస్టర్లలో గుబులు పుట్టిస్తోంది. టర్కీతో అమెరికా కయ్యానికి కాలుదువ్వుతుండగా... అధ్యక్షుడు థైప్‌ ఎర్డోగన్‌ చెత్త ఆర్థిక విధానాలతో ఆ దేశ కరెన్సీ లీరా విలువ పాతాళానికి జారిపోతోంది. ఈ ప్రకంపనలు అక్కడ పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎడాపెడా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటంతో అక్కడి స్టాక్‌ మార్కెట్‌ పేకమేడలా కూలిపోతోంది.

ఈ సంక్షోభం యూరప్‌ దేశాలకు కూడా పాకుతుందన్న ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. దీంతో అక్కడి స్టాక్‌ మార్కెట్లనూ ‘లీరా’ వెంటాడుతోంది. మొత్తంమీద టర్కీలో తలెత్తిన ఈ కరెన్సీ ముసలం ప్రపంచదేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలు టర్కీలో సంక్షోభానికి కారణమేంటి... దీనివల్ల ఎవ రిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేదానిపై ‘సాక్షి’ బిజినెస్‌ విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనమిది.

పెద్దన్న కన్నెర్ర...
మధ్య ప్రాచ్యంలో సంపన్న దేశాల్లో ఒకటైన టర్కీ భౌగోళికంగా చాలా కీలకమైన దేశం. సిరియాలో ఐసిస్‌ ఉగ్రమూకలపై సమరభేరి మోగించిన అమెరికాతో టర్కీకి ఇటీవలి కాలంలో సంబంధాలు పూర్తిగా దిగజారాయి. ఎందుకంటే కుర్దులు టర్కీకి కంట్లో నలుసులా ఉన్నారు. అలాంటి వారితో కలిసి అమెరికా ఐసిస్‌పై పోరాటం చేస్తోంది. దీన్ని టర్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

అయితే, తాజాగా గూఢచర్యం, టెర్రరిస్టు కార్యకలాపాల ఆరోపణలతో అమెరికా పాస్టర్‌ ఆండ్రూ బ్రన్సన్‌ను టర్కీ నిర్బంధించంతో ట్రంప్‌ సర్కారు అగ్గిమీదగుగ్గిలమైంది. తమ పాస్టర్‌ను విడిచిపెట్టాలంటూ అమెరికా విధించిన డెడ్‌లైన్‌పై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ ఘాటుగా స్పందించడంతో పరిస్థితి రాజకీయ రంగు పులుముకుంది. ట్రంప్‌ ప్రభుత్వం టర్కీ ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% సుంకాలను విధిస్తూ కొరడా ఝుళిపించింది.

ఇతర ఆంక్షలనూ విధించింది. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయొచ్చన్న భయాలతో అప్పటికే క్షీణిస్తూ వస్తున్న ఆ దేశ కరెన్సీ ‘లీరా’ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, అమెరికా చర్యలను ఎర్డోగన్‌ రాజకీయ కుట్రగా పేర్కొన్నారు. అమెరికా ప్రకటించిన ఆర్థిక యుద్ధానికి భయపడేది లేద న్నారు. ఈ సంక్షోభం ఎటు దారితీస్తుందోనంటూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతున్నారు. ప్రజలు తమ దగ్గరున్న డాలర్లు, బంగారాన్ని విక్రయించి లీరాల్లోకి మార్చుకోవాలని ఎర్డోగన్‌ పిలుపునివ్వడం కూడా మార్కెట్లకు మింగుడు పడటం లేదు.

అల్లుడి దెబ్బ...
ఎర్డోగన్‌ తన అల్లుడు బెరాక్‌ అల్బెరాక్‌కు ఆగమేఘాలపై ఆర్థిక మంత్రి పగ్గాలను అప్పగించడం అక్కడి మార్కెట్లలో ప్రకంపనలకు కారణమైంది. ముఖ్యంగా వడ్డీ రేట్లు తగ్గించాలని ఎర్డోగన్‌ ఎంత మొత్తుకుంటున్నా టర్కీ సెంట్రల్‌ బ్యాంక్‌ తన మాట వినకపోవడంతో తన అల్లుడికి ఆర్థిక శాఖను అప్పగించారు. దీన్ని ఇన్వెస్టర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే టర్కీలో ద్రవ్యోల్బణం 15 శాతాన్ని మించిపోవడంతో వడ్డీరేట్లను పెంచాల్సిందేననేది సెంట్రల్‌ బ్యాంక్‌ వాదన.

ఇప్పుడు అల్లుడి ద్వారా ఎర్డోగన్‌ అస్తవ్యస్త పాలసీ చర్యలకు దిగవచ్చన్న భయాలు ఆర్థికవేత్తల్లో నెలకొన్నాయి. ఇవన్నీ టర్కీ కరెన్సీ లీరాను కుప్పకూలేలా చేశాయి. గడిచిన ఏడాదికాలంగా పడుతూ వస్తున్న డాలరుతో లీరా విలువ గత వారంరోజుల్లోనే 40% మేర కుదేలైంది. సోమవారం కూడా ఒక దశలో 15 శాతానికి పైగా క్షీణించి 7.2కు జారింది. గతేడాది ఆగస్టులో లీరా విలువ 3.4 వద్ద ఉండటం గమనార్హం. అంటే అప్పటినుంచి 111% పడిపోయినట్లు లెక్క.

ఇటీవలి కాలంలో టర్కీ ఆర్థిక వ్యవస్థ మంచి వృద్ధినే నమోదు చేస్తోంది. అయితే, దీనికి భారీగా సమీకరిస్తున్న విదేశీ రుణాలే కారణమని.. ఇప్పుడు లీరా విలువ తీవ్రంగా పడిపోవడంతో రుణాల చెల్లింపుల్లో ఇబ్బందులు తప్పవనేది నిపుణుల మాట. లీరా పతనంతో టర్కీ బ్యాంకులు, కంపెనీల విదేశీ రుణ భారం 350 బిలియన్‌ డాలర్లకు పైగా ఎగబాకినట్లు అంచనా. ఈ పరిణామాలతో అక్కడి స్టాక్‌ మార్కెట్లు సైతం 17 శాతానికి పైగా కుప్పకూలాయి.


యూరప్‌పైనా ప్రభావం..
టర్కీ కంపెనీల్లోనూ... అదేవిధంగా అక్కడి బాండ్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది యూరోపియన్‌ బ్యాంకులే. కొన్ని అమెరికా బ్యాంకులు కూడా అక్కడ ఇన్వెస్ట్‌ చేశాయి. ఇప్పుడు టర్కీ కరెన్సీ సంక్షోభం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను ఎక్కడ ముంచేస్తుందోన్నది ఇన్వెస్టర్ల భయం. దీంతో స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకొని సురక్షిత సాధనాలైన బాండ్లలోకి నిధులను తరలిస్తున్నారు. దీంతో బాండ్‌ ఈల్డ్‌లు ఎగబాకి... కరెన్సీని మరింత కిందికి తోసేస్తున్నాయి.

టర్కీ గనుక డిఫాల్ట్‌ (దివాలా) వంటి సమస్యలను ఎదుర్కొంటే తమ పెట్టుబడులకు ఎక్కడ ముప్పు వస్తుందోననేది యూరప్, అమెరికా బ్యాంకుల గుబులు. ఈ ప్రభావంతో టర్కీలో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసిన యూరప్‌లోని కొన్ని బ్యాంక్‌ షేర్లు(బీబీవీఏ, యూనిక్రెడిట్, బీఎన్‌పీ పారిబా) పతనమవుతున్నాయి. టర్కీతో సంబంధం ఉన్న అమెరికా బ్యాంకు షేర్లు కూడా కుదుపులకు గురవుతున్నాయి.


వర్ధమాన దేశాలకు వణుకు...
అమెరికా అధ్యక్షడు ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధంతో వర్ధమాన దేశాల కరెన్సీలన్నీ కకావికలం అవుతున్నాయి. దీనికితోడు అమెరికా వడ్డీరేట్ల పెంపుతో డాలరు విలువ అంతకంతకూ బలోపేతమవుతోంది. తాజాగా డాలరు ఇండెక్స్‌ 96 పైకి ఎగబాకడంతో చాలా దేశాల కరెన్సీలు మరింతగా కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు టర్కీ సంక్షోభం యూరప్‌కు పాకితే ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్‌ మార్కెట్లకు పెనుముప్పు ఖాయమనేది ఆర్థిక విశ్లేషకుల అభిప్రాయం. దీంతో ఇన్వెస్టర్లు అధిక రిస్క్‌ ఉన్న అసెట్స్‌ నుంచి వైదొలగుతున్నారు. యూరో తదితర కరెన్సీల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత కరెన్సీలైన స్విస్‌ ఫ్రాంక్, జపాన్‌ యెన్‌లలోకి తరలిస్తున్నారని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇది కూడా వర్ధమాన దేశాల కరెన్సీ పతనానికి కారణమవుతోంది. ఈ ఏడాది ఇప్పటికవరకూ వెనెజులా బొలివర్‌ 97 శాతం, టర్కీ లీరా 90 శాతం, అర్జెంటీనా పెసో 36 శాతం, రష్యా రూబుల్‌ 17 శాతం, బ్రెజిల్‌ రియాల్‌ 16 శాతం, దక్షిణాఫ్రికా ర్యాండ్‌ 15 శాతం చొప్పున పడిపోయాయి. మన రూపాయి కూడా డాలరు మారకంలో సోమవారం 69.94 ఆల్‌టైమ్‌ కనిష్టానికి కుప్పకూలింది. ఈ ఏడాది ఇప్పటిదాకా మన రూపాయి 10 శాతం పైగానే తగ్గింది. అమెరికా వడ్డీరేట్లను ఇదే జోరుతో పెంచుతూ పోతే... త్వరలోనే రూపాయి 72కు కూడా పతనం కావచ్చనేది నిపుణుల అభిప్రాయం.

అంతిమంగా ఈ పరిస్థితులన్నీ వర్ధమాన దేశాలను భారీ సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం పొంచి ఉందని... 1997లో తలెత్తిన ఆసియా ఆర్థిక సంక్షోభం లాంటిది వచ్చినా ఆశ్చర్యం లేదని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన కామర్జ్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ వ్యూహకర్త ఉల్రిచ్‌ ల్యూమన్‌ అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ అప్పట్లో అనేక ఆసియా దేశాలు సంక్షోభంలోకి కూరుకుపోయిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’