స్టాక్స్‌ వ్యూ

7 May, 2018 02:01 IST|Sakshi

హీరో మోటొకార్ప్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.3,660
టార్గెట్‌ ధర: రూ.4,052

ఎందుకంటే: మార్కెట్‌ వాటా పరంగా అతి పెద్ద భారత టూ వీలర్‌ కంపెనీ అయిన హీరో మోటొకార్ప్‌..గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,560 కోట్లకు, నికర లాభం 35 శాతం వృద్ధితో రూ.970 కోట్లకు పెరిగాయి. స్థూల మార్జిన్‌ 32.4 శాతంగా ఉండగా, మార్కెటింగ్‌ వ్యయాలు అధికంగా ఉండటంతో ఇబిటా మార్జిన్‌ 16 శాతంగానే నమోదైంది.   ఈ ఏడాది జనవరి, ఏప్రిల్‌లో రెండు సార్లు ధరలు పెంచింది. హరిద్వార్‌ ప్లాంట్‌పై వస్తున్న పన్ను రాయితీల కాలం ముగిసింది.

ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌ నుంచి కనిపిస్తుంది. హలోల్‌ ప్లాంట్‌  ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం, వచ్చే ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి అందుబాటులోకి రానున్న ఆంధ్రప్రదేశ్‌ ప్లాంట్‌ ఈ ప్రభావాన్ని కొంత వరకూ తగ్గించగలవు.  ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెడుతోంది. ఐదేళ్లలో ఈ కంపెనీ వాహన విక్రయాలు 9–10 శాతం రేంజ్‌లో చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్‌(షేర్‌ వారీ ఆర్జన) 3.5 శాతం పెరగగలదని అంచనా వేస్తున్నాం. పటిష్టమైన డీలర్షిప్‌ నెట్‌వర్క్, గ్రామీణ మార్కెట్లలోకి విస్తృతంగా చొచ్చుకుపోవడం, వేగంగా వృద్ధి చెందుతున్న స్కూటర్ల, ప్రీమియమ్‌ బైక్‌ సెగ్మెంట్లలో మరిన్ని కొత్త మోడళ్ల ద్వారా విక్రయాల వృద్ధి పెరగనుండడం, గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడం, లీప్‌ 20 కార్యక్రమంలో భాగంగా వ్యయ నియంత్రణ చర్యలు మంచి ఫలితాలనిస్తుండటం.. సానుకూలాంశాలు.  


హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.930
టార్గెట్‌ ధర: రూ.1,000

ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 3 శాతం వృద్ధితో రూ.13,179 కోట్లకు పెరగ్గా,  నికర లాభం రూ.2,227 కోట్లుగా నమోదైంది. సాధారణంగా క్యూ4లో సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌ బలహీనంగా ఉంటుంది. అయినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం, కరెన్సీ ఒడిదుడుకుల ప్రయోజనాలతో 19.6 శాతం ఇబిటా మార్జిన్‌  సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మార్జిన్‌ 19.5–20.5 శాతంగా ఉండగలదని కంపెనీ అంచనా వేస్తోంది. 

ఆదాయం వృద్ధి, అమెరికాలో కంటే యూరప్, ఇతర దేశాల్లో (ఆర్‌ఓడబ్ల్యూ) అధికంగా ఉంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయ వృద్ధి  యూరప్‌లో 3.6 శాతం, ఆర్‌ఓడబ్ల్యూలో 8.1 శాతంగా ఉంది. అమెరికాలో 0.7 శాతం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.5–11.5శాతం రేంజ్‌లో రాగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఒక రకంగా ఇది బలహీనమైన ‘గైడెన్స్‌’. కొత్తగా వస్తున్న టెక్నాలజీస్‌–డిజిటల్, క్లౌడ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) తదితర సెగ్మెంట్లలలో తన స్థితిని పటిష్టం చేసుకునే ప్రయత్నాల్లో  భాగంగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది.

వివిధ క్లయింట్లతో కుదుర్చుకునే డీల్స్‌ సైజు పెరగగలదని కంపెనీ భావిస్తోంది. రెండేళ్లలో ఆదాయం 11 శాతం, నికర లాభం 7 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. ఈ ఏడాది మార్చి చివరి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు 157 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.2 డివిడెండ్‌ను ప్రకటించింది.  ఈ కంపెనీ డివిడెండ్‌ను ఇవ్వడం ఇది వరుసగా 61వ క్వార్టర్‌.  

మరిన్ని వార్తలు