స్టాక్స్ వ్యూ

18 Jun, 2018 01:57 IST|Sakshi

ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ధర: రూ.140, టార్గెట్‌ ధర: రూ.199
ఎందుకంటే: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కంపెనీ జీవిత బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్, ప్రైవేట్‌ ఈక్విటీ, కార్పొరేట్‌  లెండింగ్, సాధారణ బీమా బ్రోకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, ఈక్విటీ, కరెన్సీ, కమోడిటీ బ్రోకింగ్‌.ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్, హౌసింగ్‌ ఫైనాన్స్, పెన్షన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్, వైద్య బీమా తదితర 13 రంగాల్లో సేవలందిస్తోంది. 1.42 లక్షల మంది ఏజెంట్లు, 12 వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వేగంగా వృద్ధి సాధించే ఆర్థిక సేవలనందించడం ద్వారా లాభదాయకత పెంచుకుంటోంది.

పటిష్టమైన మాతృసంస్థ కారణంగా,  మూలధన నిధులు పుష్కలంగా సమీకరించగలదు. వడ్డీరేట్లు పెరగనుండడం ప్రతికూలమే అయినా, వివిధ రంగాలకు రుణాలివ్వడం, ప్రైసింగ్‌ పవర్‌ వల్ల కంపెనీ మార్జిన్లపై ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని భావిస్తున్నాం. అందుబాటు ధరల్లో గృహాలు అందించడానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఈ కంపెనీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ విభాగానికి ప్రయోజనం కలిగించేదే.

పటష్టమైన ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కంపెనీ కావడం, కంపెనీ రుణాలకు రిస్క్‌ తక్కువగా ఉండడం, క్రాస్‌ సెల్లింగ్‌ కారణంగా అవకాశాలు పెంచుకోగల వీలుండటం సానుకూలాంశాలు. రెండేళ్లలో షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 30% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 13%గా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 17%కి పెరగగలదని భావిస్తున్నాం. ఈ కంపెనీ వ్యాపారాలన్నీ సానుకూల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉన్నవే. ఆర్థిక మందగమన పరిస్థితులు చోటు చేసుకుంటే అది ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.


బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌  ప్రస్తుత ధర: రూ.537, టార్గెట్‌ ధర: రూ.650
ఎందుకంటే: బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ప్రాజెక్ట్‌ల అమలు జోరు పెరగడంతో ఈపీసీ విభాగం 44 శాతం వృద్ధి చెందింది. దీంతో కంపెనీ ఆదాయం 27 శాతం పెరిగి రూ.1,606 కోట్లకు ఎగసింది. వినియోగ వస్తువుల ఆదాయం 15 శాతం పెరిగింది. డిమాండ్‌ పూర్తిగా క్షీణించడంతో సీఎఫ్‌ఎల్‌ బిజినెస్‌కు సంబంధించి స్టార్‌లైట్‌ లైటింగ్‌లోని రూ.89 కోట్ల పెట్టుబడులకు  వన్‌టైమ్‌ రైట్‌ ఆఫ్‌ కారణంగా నికర లాభంపై ప్రభావం పడింది.

స్థూల మార్జిన్‌ తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ నిర్వహణ మార్జిన్‌ పటిష్టంగా ఉంది. ఉద్యోగ వ్యయాలు తక్కువగా ఉండటం కలసివచ్చింది. ఈపీసీ సెగ్మెంట్‌ ఆర్డర్‌ బుక్‌ పటిష్టంగా ఉంది. వీటిల్లో అధిక మార్జిన్లు లభించే ఆర్డర్లు అధికంగా ఉన్నాయి. ఇటీవలనే ఉత్తర ప్రదేశ్‌లో రూ.5,962 కోట్ల గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్ట్‌ను సాధించింది. ఈ విభాగం అమ్మకాలు రెండేళ్లలో 21 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం.

వర్షాలు బాగా ఉంటాయనే అంచనాల కారణంగా గ్రామీణ మార్కెట్లు పుంజుకోవడంతో వినియోగ వస్తువుల విభాగం మంచి ఆదాయం సాధిస్తుందని భావిస్తున్నాం. రెండేళల్లో ఈ  విభాగం ఆదాయం 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా.  గత ఏడాది డిసెంబర్‌ నాటికి 1,30,000గా ఉన్న రిటైల్‌ అవుట్‌లెట్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 1,60,000కు పెంచుకోనుండటం, జీఎస్‌టీ అమలు తర్వాత అసంఘటిత రంగం నుంచి మార్కెట్‌ వాటా ఈ కంపెనీకి పెరగనుండటం,  పటిష్టమైన డీలర్ల నెట్‌వర్క్‌... ఇవన్నీ సానుకూలాంశాలు.


గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

మరిన్ని వార్తలు