స్టాక్స్‌ వ్యూ

19 Nov, 2018 00:58 IST|Sakshi

సన్‌ టీవీ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర:         రూ.608
టార్గెట్‌ ధర:         రూ.835

ఎందుకంటే: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. చందా ఆదాయం 21 శాతం వృద్ధి చెందింది. కానీ ప్రకటనల ఆదాయం 3 శాతమే పెరిగింది. మొత్తం మీద  కంపెనీ ఆదాయం 11 శాతమే వృద్ధి చెంది రూ.740 కోట్లకు పెరిగింది. ఇబిటా 12 శాతం పెరిగి రూ.550 కోట్లకు చేరింది. ఇబిటా వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, తరుగుదల తక్కువగా ఉండటం, ఇతర ఆదాయం అధికంగా ఉండటంతో నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.350 కోట్లకు పెరిగింది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో ఆదాయం 28 శాతం, ఇబిటా 36 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున పెరిగాయి. మిగిలిన ఆరు నెలల కాలానికి ప్రకటనల ఆదాయం పది శాతానికి పైగా వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 18 శాతం, ప్రకటనల ఆదాయం 12 శాతం, చందా ఆదాయం 19 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా.

గత ఆరు నెలల కాలంలో ఈ షేర్‌ 30 శాతం క్షీణించింది.దీంతో కొనుగోళ్లకు ప్రస్తుత ధర ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కంపెనీ పెట్టిన పెట్టుబడిపై రాబడి (ఆర్‌ఓసీఈ) 31 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ఓవర్‌ ద టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌పై సన్‌ నెక్స్ట్‌ట్‌ను అందుబాటులోకి తేవడం, బెంగాలీ చానల్‌ను ప్రారంభించనుండటం, సన్‌ లైఫ్‌ చానల్‌ను మళ్లీ తీసుకురావడం... వీటిపై పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రతిఫలాలు ఇవ్వడానికి మరికొంత కాలం పట్టనుండటం... ప్రతికూలాంశాలు.

యాక్సిస్‌ బ్యాంక్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర:         రూ.620
టార్గెట్‌ ధర:         రూ.725
ఎందుకంటే:
ప్రైవేట్‌ రంగంలోని ఈ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు బావున్నాయి. రుణ నాణ్యత మెరుగుపడింది.  ఈ క్యూ1లో రూ.4,337 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.2,777 కోట్లకు తగ్గాయి. గత క్వార్టర్లను పరిగణనలోకి తీసుకుంటే ఇదే అత్యంత కనిష్ట స్థాయి. ఇటీవల రుణాల చెల్లింపుల్లో విఫలమైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీకి ఈ బ్యాంక్‌ ఇచ్చిన రుణాలు రూ.825 కోట్ల మేరకు ఉన్నాయి.

రుణాలు 11 శాతం వృద్ధి చెంది రూ.4,56,121కోట్లకు పెరిగాయి. రిటైల్‌ రుణాలు 20 శాతం వృద్ధి చెందాయి. గత కొన్ని క్వార్టర్లుగా అంతంత మాత్రం వృద్ది సాధించిన కార్పొరేట్‌ రుణాలు 21 శాతం పెరిగాయి. నిర్వహణ లాభం 8.4 శాతం వృద్ధితో రూ.4,094 కోట్లకు పెరిగింది. నికర లాభం 82 శాతం వృద్ధితో రూ.790 కోట్లకు ఎగసింది. కేటాయింపులు తగ్గాయి.  రుణాలు, లాభదాయకత విషయంలో మూడో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇదే.

రెండేళ్లలో రుణాలు 18 శాతం చక్రగతి వృద్ధితో రూ.6,07,702 కోట్లకు పెరగగలవని అంచనా వేస్తున్నాం. మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్లు 48 శాతంగా ఉన్నాయి. 2018–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ బ్యాంక్‌ నికర వడ్డీ మార్జిన్‌ను 3 శాతానికి పైగానే సాధిస్తోంది.  వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 13 శాతానికి మించి ఉండగలదని, అలాగే రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 1.1 శాతంగా ఉండగలదని భావిస్తున్నాం.


గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

>
మరిన్ని వార్తలు