స్టాక్స్ వ్యూ

22 Feb, 2016 02:41 IST|Sakshi

జెట్ ఎయిర్‌వేస్ : కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్
ప్రస్తుత ధర: రూ.558   టార్గెట్ ధర: రూ.790
ఎందుకంటే: ప్యాసింజర్ ట్రాఫిక్ 21 శాతం పెరగడం, విమానయాన ఇంధనం ధరలు 31 శాతం తగ్గడంతో మూడో త్రైమాసిక కాలానికి జెట్ ఎయిర్‌వేస్ కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. ఆదాయం 5 శాతం వృద్ధితో రూ.5,880 కోట్లకు పెరిగింది. విమాన ఇంధనం ధరలు బాగా పడిపోవడంతో గత క్యూ3లో రూ.171 కోట్లుగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో రూ.929 కోట్లకు పెరిగింది.

జెట్‌లైట్ ఇన్వెస్ట్‌మెంట్స్ విలువ తగ్గిపోవడంతో వచ్చిన రూ.47 కోట్ల నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్నా కంపెనీ నికర లాభం రూ.515కోట్లకు పెరిగింది. అందుకనే గత రెండేళ్లలో దేశీయ ట్రాఫిక్ అంతంత మాత్రం వృద్ధి సాధిస్తున్నా, అంతర్జాతీయ ట్రాఫిక్ దన్నుతో జెట్ ఎయిర్‌వేస్ మంచి  రాబడి సాధిస్తోంది. అంతేకాకుండా కరెన్సీ ఒడిదుడుకులకు సహజమైన హెడ్జింగ్‌గా అంతర్జాతీయ సెగ్మెంట్ పనిచేస్తోంది. గత నాలుగేళ్లలో దేశీయ రూట్ల ఆదాయం 8 శాతం చక్రగతిన వృద్ధి సాధించగా, అంతర్జాతీయ సెగ్మెంట్ ఆదాయం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది.

జెట్ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటాను ఎతిహాద్ కంపెనీ కొనుగోలు చేయడం అంతర్జాతీయ సెగ్మెంట్ వృద్ధికి తోడ్పడింది. ఎతిహాద్‌తో కుదుర్చుకున్న కొత్త కోడ్-షేరింగ్ ఒప్పందం జెట్ ఎయిర్‌వేస్‌కు ప్రయోజనం కలిగించనున్నది. దీర్ఘకాలంలో కంపెనీ మార్జిన్లు పెరుగుతాయి. దేశీయ సెగ్మెంట్లో కొత్త కంపెనీల రాకతో పోటీ తీవ్రమవుతోంది. అయితే విమానయాన ఇంధనం ధరలు బాగా తగ్గడం కలసివస్తోంది. రెండేళ్లలో ఆదాయం 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని ఏడాది కాలానికి ఈ షేర్ రూ.790కు చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధరలో కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేస్తున్నాం.
 
 
అశోక్ లేలాండ్  : కొనొచ్చు

బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్
ప్రస్తుత ధర: రూ.91  టార్గెట్ ధర: రూ.111
ఎందుకంటే: భారత్‌లో వాణిజ్య వాహనాలు తయారు చేసే రెండో అతి పెద్ద కంపెనీ. మధ్య, భారీ తరహా వాణిజ్య వాహన(ఎంహెచ్‌సీవీ) మార్కెట్లో కంపెనీ మార్కెట్ వాటా 28 శాతంగా ఉంది.  మూడో త్రైమాసిక కాలానికి ప్రకటించిన ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. వాహన విక్రయాలు 23 శాతం పెరగడంతో ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.4,085 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.430 కోట్లకు వృద్ధి చెందింది.  రూ.205 కోట్ల నికర లాభం సాధించింది. వరుసగా నాలుగో క్వార్టర్‌లోనూ మార్జిన్లలో రెండంకెల వృద్ధి సాధించింది.  

ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతుండటం, డీజిల్ ధరలు తగ్గుతుండటంతో లాభదాయకత పెరుగుతుండడం, మౌలిక, మైనింగ్ రంగాల్లో జోరు పెంచే చర్యలను ప్రభుత్వం తీసుకుంటుండటంతో రవాణా, ట్రక్కు ఆపరేటర్ల సెంటిమెంట్ మెరుగుపడుతోంది. దీంతో ఎంహెచ్‌సీవీ సెగ్మెంట్ రెండంకెల వృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగా ఉన్న ఆపరేటింగ్ మార్జిన్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నాం. త్వరలో సన్‌షైన్ పేరుతో ప్యాసింజర్ వేరియంట్‌ను, గురు పేరుతో గూడ్స్ క్యారియర్‌ను అందించనున్నది.

తక్కువ స్థాయిల్లో ఉన్న కమోడిటీ ధరలు మరికొంత కాలం కొనసాగుతాయని, ఫలితంగా ముడిసరుకు వ్యయాలు తగ్గుతాయని కంపెనీ భావిస్తోంది. పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాది కాలానికి ఈ షేర్ రూ.111కు ధరను చేరుతుందనే అంచనాలతో ప్రస్తుత ధర వద్ద కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేస్తున్నాం.
 
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

మరిన్ని వార్తలు