స్టాక్స్‌ వ్యూ

6 Feb, 2017 02:07 IST|Sakshi

బజాజ్‌ ఫైనాన్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ. 1,047,  టార్గెట్‌  ధర: రూ. 1,300

ఎందుకంటే: బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటంతో నికర లాభం రూ.556 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.1,547 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు 33 శాతం వృద్ధితో రూ.57,605 కోట్లకు చేరాయి. స్థూల మొండి బకాయిలు 1.47 శాతంగా ఉన్నాయి.  చిన్న మొత్తాల్లో రుణాలివ్వడం, జీవన శైలి ఉత్పత్తులకు రుణాలివ్వడం, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించడం,  రుణాల్లో వివిధీకరణ తదితర కారణాల వల్ల అగ్రగామి ఎన్‌బీఎఫ్‌సీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కారణాల వల్లే 2011–16 మధ్య కాలంలో నిర్వహణఆస్తులు 42 శాతం, నికర లాభం 39 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి.  పలు ఎన్‌బీఎఫ్‌సీల స్థూల మొండి బకాయిలు 2.5 శాతానికి మించి ఉండగా, ఈ కంపెనీ స్థూల మొండి బకాయిలు 1.2 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో రుణ నాణ్యత బాగా మెరుగుపడింది. జీవన శైలి ఉత్పత్తులకు, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించే అంశంలో ఈ కంపెనీకి పోటీ తక్కువగా ఉండడం వల్ల వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిర్వహణ పనితీరు నిలకడగా ఉండడం, మార్జిన్లు, వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యతపై నియంత్రణ తదితర అంశాల కారణంగా రెండేళ్లలో నికర లాభం 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. అలాగే రిటర్న్‌ ఆన్‌ ఆసెట్‌ 3.3 శాతంగానూ, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 23 శాతంగానూ ఉండొచ్చని అంచనా. రెండేళ్ల కాలంలో నిర్వహణ ఆస్తులు 32 శాతం చక్రగతి వృద్ధితో రూ.76,777 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నాం.

టెక్‌ మహీంద్రా
బ్రోకరేజ్‌ సంస్థ: ఏంజెల్‌ బ్రోకింగ్‌
ప్రస్తుత ధర: రూ. 481,  టార్గెట్‌  ధర: రూ. 600

ఎందుకంటే:   మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 13 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.751 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో  13 శాతం వృద్ధితో రూ.856 కోట్లకు పెరిగింది. క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వ్యయాలు 25 శాతం తగ్గడంతో ఈ క్యూ3లో మంచి నికర లాభం సాధించింది.  గత క్యూ3లో 11.5 శాతంగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో 12.4 శాతానికి పెరిగింది. ఈ క్యూ3లో కొత్తగా 19 క్లయింట్లను సాధించింది. దీంతో కంపెనీ మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు చేరింది.  ఆదాయం, డీల్స్‌ పరంగా కమ్యూనికేషన్స్‌ విభాగం మంచి పనితీరు కనబరుస్తోంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఆరోగ్య సంరక్షణ, తయారీ, రిటైల్‌ రంగాల నుంచి ఐటీ, సంబంధిత సేవలకు డిమాండ్‌ పెరుగుతుందని, వాటిని అందిపుచ్చుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. గతంలో సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసింది. ఇటీవలనే ఎల్‌సీసీ, సాఫ్ట్‌జెన్‌లను చేజిక్కించుకుంది. మరిన్ని కంపెనీలను  కొనుగోలు చేసి, విలీనం చేసుకోవడం ద్వారా వృద్ధిని పెంచుకుంటోంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీలను కొనుగోలు చేసి విలీనం చేసుకోవడంతో పాటు ఆర్డర్లు కూడా జోరుగా ఉంటుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా కంపెనీ ఆదాయం డాలర్ల పరంగా 11 శాతంగా, రూపాయిల పరంగా 12% చక్రగతి వృద్ధి ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2009లో సమస్యల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి 2014 కల్లా టర్న్‌ అరౌండ్‌ను సాధించింది. అలాగే ఇటీవల కొనుగోలు, విలీనం చేసుకున్న కంపెనీల పనితీరు మెరుగుపరచి భవిష్యత్తులో 20% ఇబిటా సాధించగలదన్న అంచనాలున్నాయి.

>
మరిన్ని వార్తలు