స్టాక్స్‌ వ్యూ

28 Aug, 2017 00:36 IST|Sakshi

క్రెడిట్‌ ఎనాలసిస్‌ అండ్‌ రీసెర్చ్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌
ప్రస్తుత ధర: రూ.1,454   టార్గెట్‌ ధర: రూ.1,770


ఎందుకంటే:  రేటింగ్‌ సర్వీసులందజేసే రెండో అతిపెద్ద భారత కంపెనీ ఇది. మాల్దీవులు, హాంగ్‌కాంగ్, నేపాల్, మారిషస్‌లకు కూడా తన సేవలను విస్తరించింది. బ్రెజిల్, పోర్చుగల్, మలేషియా, దక్షిణాఫ్రికా దేశాల్లో రేటింగ్‌ సర్వీసులందజేయడానికి ఆయా దేశాలకు చెందిన క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. రీసెర్చ్‌ సర్వీసులు కూడా అందిస్తోంది. ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియో సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించింది. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసుల రంగంలోకి కూడా ప్రవేశించనున్నది. భారత్‌లో ఆర్థిక పరిస్థితుల మెరుగుపడుతుండటంతో కార్పొరేట్‌ డెట్‌ రేటింగ్స్, బ్యాంక్‌లోన్‌ రేటింగ్స్‌కు డిమాండ్‌ పెరుగుతుందని అంచనా. కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.

 ఆదాయం 7 శాతం వృద్ధి చెందింది. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ పుంజుకుంటుండటం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, మౌలిక, గృహ నిర్మాణ రంగాలకు ప్రభుత్వ కేటాయింపులు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల రుణ వృద్ధి పుంజుకోగలదని కేర్‌ అంచనా వేస్తోంది. ఫలితంగా కంపెనీ అమ్మకాలు రెండేళ్లలో 12% చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. క్యూ1లో కొత్తగా 817 క్లయింట్లు లభించారు. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 15,222కు పెరిగింది. రెండేళ్లలో ఇబిటా 13 శాతం చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా. ఈ కంపెనీ రేటింగ్‌ అంచనాలు తప్పితే కంపెనీ విశ్వసనీయత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి.  ఈ కంపెనీ మొత్తం ఆదాయంలో రేటింగ్‌ ఆదాయం 97 శాతంగా ఉంది. పోటీ కంపెనీలైన క్రిసిల్, ఇక్రాల ఆదాయంలో వివిధీకరణ సాధించాయి. వ్యయాల నియంత్రణ, టెక్నాలజీ వినియోగం కారణంగా ఈ కంపెనీకి నిర్వహణ మార్జిన్లు అధికంగా ఉన్నాయి. కొత్త విభాగాల్లోకి, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం.. మార్జిన్లపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.

ఎన్‌బీసీసీ
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.205      టార్గెట్‌ ధర: రూ.227


ఎందుకంటే: ఎన్‌బీసీసీ.ప్రభుత్వ రంగ  నవరత్న కంపెనీల్లో ఒకటి. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ(పీఎంసీ), ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ), రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. ఆదాయ వృద్ది ఆంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వ్యయాలు తక్కువగా ఉండడం, ఇబిటా మార్జిన్లు అధికంగా ఉండటంతో నికర లాభం 24% వృద్ది చెందింది. పీఎంసీ వ్యాపారం 3% పెరగ్గా, రియల్‌ ఎస్టేట్‌వ్యాపారం 49%, ఈపీసీ వ్యాపారం 10% చొప్పున క్షీణించాయి.  ఇబిటా మార్జిన్లు 160 బేసిస్‌ పాయింట్లు వృద్ది చెంది 5.1 శాతానికి పెరిగాయి. వడ్డీ వ్యయాలు తగ్గడంతో నికర లాభం 24 శాతం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇబిటా మార్జిన్‌ 7 శాతానికి చేరగలదని అంచనా. పూర్తి చేయాల్సిన ఆర్డర్లు రూ.75వేల కోట్లకు పైగా ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల మేర ఆర్డర్లు వస్తాయని అంచనా. రీడెవలప్‌మెంట్‌ ఆర్డర్లు భారీగా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం నుంచి ఆదాయ వృద్ధి మరింతగా మెరుగుపడగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 38 శాతం, నికర లాభం 42 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. భారీ ప్రాజెక్టుల అమలులో నైపుణ్యం, పోటీ తక్కువగా ఉండడం, ఆర్డర్‌ బుక్‌ భారీగా ఉండడం.. ఇవన్నీ సానుకూలాంశాలు. ఇటీవలనే పది రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌ను ఈ కంపెనీ సాధించింది. రానున్న కొన్నేళ్లలో మరో 40–50 రైల్వే స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లను సాధించే అవకాశాలున్నాయి. ఒక్కో రైల్వే స్టేషన్‌ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌  విలువ రూ.400–500కోట్ల రేంజ్‌లో ఉంటుంది. రూ.25,000–40,000 కోట్ల విలువ ఉండే ముంబైలోని ధారవి మురికివాడ రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కూడా ఈ కంపెనీకే దక్కవచ్చు.

మరిన్ని వార్తలు