స్టాక్స్‌ వ్యూ

18 Dec, 2017 01:52 IST|Sakshi

దిలిప్‌ బిల్డ్‌కాన్‌  కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: నిర్మల్‌బంగ్‌
ప్రస్తుత ధర: రూ.904         టార్గెట్‌ ధర: రూ. 1,324

ఎందుకంటే: భారత్‌లోని  రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పెద్ద కంపెనీల్లో ఇది ఒకటి.  ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ), రాష్ట్ర ప్రభుత్వాలు, కోల్‌ ఇండియా వంటి కంపెనీల రోడ్డు ప్రాజెక్ట్‌లను చేపట్టి, తక్కువ వ్యయంతో, మంచి నాణ్యతతో సకాలంలో పూర్తి చేసిన ట్రాక్‌ రికార్డ్‌ ఈ కంపెనీ సొంతం. ఈ కంపెనీ ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, మైనింగ్‌ తదితర రంగాల్లోకి డైవర్సిఫై అయింది. ఈ కంపెనీ 24 ప్రాజెక్ట్‌లను రూ.1,600 కోట్లకు విక్రయించడానికి ఇటీవలనే శ్రీరామ్‌ గ్రూప్‌కు చెందిన చత్వాల్‌ గ్రూప్‌ ట్రస్ట్‌తో  ఒప్పందం కుదుర్చుకుంది.

  చేపట్టిన ప్రాజెక్ట్‌లను షెడ్యూల్‌ కంటే ముందే పూర్తి చేసిన ట్రాక్‌ రికార్డ్‌ ఈ కంపెనీది. ఇలా ముందుగానే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం వల్ల వివిధ సంస్థల నుంచి ఇప్పటిదాకా రూ.345 కోట్ల ఎర్లీ కంప్లీషన్‌ బోనస్‌ను ఈ కంపెనీ సాధించింది. ఈ కంపెనీ.. వివిధ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్, అమలుపై సరైన దృష్టి పెడుతుండటంతో ఇతర కంపెనీల కన్నా అధిక నిర్వహణ మార్జిన్‌లను, తద్వారా రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ)లను సాధిస్తోంది. ఎన్‌హెచ్‌ఏఐ, భారతమాల పరియోజన స్కీమ్‌ ద్వారా కేంద్రం రహదారుల నిర్మాణానికి రూ.6.92 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నది. వీటిల్లో అధిక భాగం ఆర్డర్లను దిలిప్‌ బిల్డ్‌కాన్‌ వంటి కంపెనీలు సాధించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

గతంలోని విజయవంతంగా ప్రాజెక్ట్‌లను నిర్వహించిన తీరు. సొంత ఎక్విప్‌మెంట్, నిధులు పుష్కలంగా ఉండడం, రుణాలు సమీకరించే సత్తా అధికంగా ఉండడం....దీనికి ప్రధాన కారణాలు. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం  25 శాతం వృద్ధితో రూ.5,075 కోట్లకు, ఇబిటా 45 శాతం వృద్ధితో రూ.992 కోట్లకు, నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.361 కోట్లకు పెరిగాయి. రెండేళ్లలో ఆదాయం 30 శాతం, ఇబిటా 28 శాతం, నికర లాభం 41 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో 19.5 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 2019–20 ఆర్థిక సంవత్సరంలో 25 శాతానికి పెరుగుతుందని అంచనా. భూ సమీకరణ తదితర సమస్యల వల్ల ప్రాజెక్ట్‌ల అమల్లో జాప్యం కారణంగా కంపెనీ ఆదాయ, ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశాలుండడం.. ప్రతికూలాంశం.  


ఒబెరాయ్‌ రియల్టీ  కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.476          టార్గెట్‌ ధర: రూ. 580

ఎందుకంటే: ముంబై కేంద్రంగా రెసిడెన్షియల్, కమర్షియల్, హాస్పిటాలిటీ సెగ్మెంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రీమియమ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కంపెనీ ఇది.  సకాలంలో మంచి నాణ్యతతో ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం వల్ల గత 20 ఏళ్లుగా రియల్టీ రంగంలో మంచి బ్రాండ్‌గా ఎదిగింది. ఫలితంగా  50 శాతానికి పైగా ఇబిటా మార్జిన్లు సాధిస్తోంది. ఇటీవలే అందుబాటు గృహాల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. ఫలితంగా పన్ను ప్రోత్సాహకాలు పొందనున్నది. రెరా(రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ యాక్ట్‌) అమలు కారణంగా రియల్టీ రంగంలో కంపెనీల విలీనాలు, కొనుగోళ్లు జోరుగా జరుగుతాయి.

పటిష్టమైన ఆర్థిక స్థితిగతులు ఉన్న కంపెనీగా ఇది ఒబెరాయ్‌ రియల్టీకి ప్రయోజనం కలిగించే అంశమే. బొరివలి, వర్లిలో రెండు మాల్స్‌ను, ఆఫీస్‌ కాంప్లెక్స్‌ను నిర్మిస్తోంది. ఫలితంగా   గత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లుగా ఉన్న లీజింగ్‌ ఆదాయం 2020–21 కల్లా రూ.800 కోట్లకు పెరుగుతాయని అంచనా. అంతేకాకుండా కంపెనీ ఆదాయానికి నిలకడ లభిస్తుంది.ముంబై, ధానేల్లో ఖరీదైన ప్రాంతాల్లో ఈ కంపెనీకి భూములున్నాయి. 10–12 ఏళ్లలో అభివృద్ధి చేయడానికి 25 ఎకరాల స్థలాలు కూడా కంపెనీకి ఉన్నాయి.  ఏ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినా మూడు నెలల్లోనే 20 శాతానికి పైగా బుకింగ్స్‌ పూర్తి కావడం, కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టటానికి కావలసిన  నిధులు పుష్కలంగా ఉండడం, పటిష్టమైన బ్రాండ్‌ కారణంగా తన ఉత్పత్తులను ప్రీమియమ్‌ ధరలకు విక్రయించుకోగల సత్తా.. సానుకూలాంశాలు. 

రుణ, ఈక్విటీ నిష్పత్తి 0.1 గానే ఉండడం చెప్పుకోదగ్గ  మరో విషయం. మూడేళ్లలో ఆదాయం 47 శాతం, నికర లాభం 56 శాతం చొప్పున  చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 2019–20 కల్లా 18 శాతానికి పెరగగలదని, అలాగే రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌(ఆర్‌ఓసీఈ) 6 శాతం నుంచి 14 శాతానికి చేరుతుందని భావిస్తున్నాం. రియల్టీ రంగానికి సంబంధించి ప్రభుత్వ విధానాల్లో మార్పులు, చేర్పులు, నిర్మాణ రంగ కార్మికులు సమ్మెకు దిగే అవకాశాలు, ఒక్క ముంబై నగరంపైననే దృష్టి కేంద్రీకరించడం, ప్రొపర్టీ ధరలు పడిపోయే అవకాశాలు... ఇవన్నీ ప్రతికూలాంశాలు.  

మరిన్ని వార్తలు