స్టాక్స్‌ వ్యూ

15 Jan, 2018 00:57 IST|Sakshi

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌    
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ.1,705 
టార్గెట్‌ ధర: రూ.2,076 

ఎందుకంటే: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 25 శాతం వృద్ధితో రూ.940 కోట్లకు పెరిగింది. కార్పొరేట్‌ రుణాలు 26 శాతం, రిటైల్‌ రుణాలు 24 శాతం, క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు 55 శాతం చొప్పున వృద్ధి సాధించడంతో మొత్తం రుణాలు 25 శాతం పెరిగాయి. దీంతో నికర వడ్డీ ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 3.99 శాతం నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) సాధించింది. ట్రెజరీ ఆదాయం అంతంత మాత్రమే ఉండగా, ఇతర ఆదాయం ఒకింత తగ్గింది.  మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో మార్జిన్లు అధికంగా వచ్చే రిటైల్‌ రుణాలు 41%గా ఉన్నాయి. రుణ నాణ్యత స్వల్పంగా తగ్గింది. స్థూల మొండిబకాయిలు 1.16%కి, నికర మొండి బకాయిలు 0.46%కి పెరిగాయి. కాసా జోరు కొనసాగడంతో కాసా నిష్పత్తి 43%కి ఎగసింది. 2019–20 కల్లా వాహనేతర రిటైల్‌ రుణాల వాటా పెంచుకోవాలనే లక్ష్య సాధనపై ఈ బ్యాంక్‌ దృష్టి పెట్టింది. 25–30 శాతం రేంజ్‌లో రుణ వృద్ధి సాధించాలనేది బ్యాంక్‌ నిర్దేశించుకున్న కీలక లక్ష్యాల్లో ఒకటి. దీని కోసం, బ్రాంచ్‌ విస్తరణ కొనసాగిస్తోంది. భారత ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను విలీనం చేసుకోవడం వల్ల బ్యాంక్‌ రాబడి నిష్పత్తులు పెరుగుతాయి.  మార్కెట్‌ వాటా పెరుగుతుండడం, కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాలైన రుణాలను ఇవ్వడం, ప్రస్తుతం 1,320గా ఉన్న బ్రాంచ్‌లను 2019–20 ఆర్థిక  సంవత్సరం కల్లా 2,000కు పెంచుకోనుండటం... తదితర కారణాల వల్ల రుణ వృద్ధి 26 శాతానికి మించి చక్రగతి వృద్ధి సాధించగలదని అంచనా వేస్తున్నాం.  బ్యాంకింగ్‌ పరిశ్రమలో అత్యుత్తమ స్థాయిలో మూలధన నిధులున్న బ్యాంక్‌ ఇదే.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌     
బ్రోకరేజ్‌ సంస్థ: జియోజిత్‌ ఫైనాన్షియల్‌  
ప్రస్తుత ధర: రూ.405 
టార్గెట్‌ ధర: రూ.480 

ఎందుకంటే: ఆస్తుల పరంగా రెండో అతి పెద్ద ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటిష్‌ ఎమ్‌ఎన్‌సీ ప్రుడెన్షియల్‌ కార్పొరేషన్‌ హోల్డింగ్‌ల జాయింట్‌ వెంచర్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. 521 కార్యాలయాలతో, పదివేలకు పైగా ఉద్యోగులతో, లక్ష మందికి పైగా ఏజెంట్లతో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎల్‌ఐసీ తర్వాత అత్యధిక మంది ఏజెంట్లు ఉన్నది ఈ సంస్థకే. అంతేకాకుండా నిర్వహణ ఆస్తులు అత్యధికంగా ఉన్న ప్రైవేట్‌ రంగ బీమా కంపెనీ కూడా ఇదే. జీవిత బీమా, ఆరోగ్య బీమా,  పెన్షన్‌ సంబంధిత విస్తృతమైన, విభిన్నమైన పాలసీలను అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో జీవిత బీమా రంగంలో ప్రైవేట్‌ కంపెనీల మార్కెట్‌ షేర్‌ 22 శాతంగా ఉండగా, దీంట్లో 12 శాతం వాటా ఈ కంపెనీదే. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 22 శాతంగా, ఆర్‌ఓఈవీ(రిటర్న్‌ ఆన్‌ ఎంబెడెడ్‌ వేల్యూ–ప్రస్తుత వ్యాపారం ద్వారా భవిష్యత్తులో వచ్చే లాభాలు–బీమా కంపెనీ విలువ మదింపులో ఇది ఒక అంశం) 15 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. కొత్త వ్యాపారం మార్జిన్లు ఆరోగ్యకరంగా ఉండడం, అండర్‌ రైటింగ్‌ కార్యకలాపాలు బాగా ఉండటం, కఠినమైన వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా ఈ రాబడి నిష్పత్తులు పటిష్టంగానే కొనసాగుతాయని అంచనా వేస్తున్నాం.   విస్తృతంగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ కారణంగా కొత్త వినియోగదారులను సాధించడం ఈ బీమా సంస్థకు సులువైన పని.  గత ఆర్థిక సంవత్సరంలో కొత్త వ్యాపారం 62% వృద్ధి చెందింది. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 2.8% సాల్వెన్సీ రేషియో(కనీసం 1.5% ఉండాలి)ను సాధించింది.

మరిన్ని వార్తలు