స్టాక్స్‌ వ్యూ

8 May, 2017 00:13 IST|Sakshi
స్టాక్స్‌ వ్యూ

హెచ్‌డీఎఫ్‌సీ : కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
టార్గెట్‌  ధర: రూ.1,750  ;  ప్రస్తుత ధర: రూ.1,547

ఎందుకంటే: దేశంలో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇది. బ్యాంకులను కూడా పరిగణనలోకి తీసుకుంటే, గృహరుణాల్లో ఎస్‌బీఐ తర్వాతి స్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం(స్టాండోలోన్‌) గత ఆర్థిక సంవత్సరం క్యూ3తో పోల్చితే 20 శాతం వృద్ధితో రూ.2,044 కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర వడ్డీ ఆదాయం 15 శాతం వృద్ధితో రూ.2,761 కోట్లకు పెరిగింది.

నికర వడ్డీ మార్జిన్‌ నిలకడగా 4 శాతంగా ఉంది. మొత్తం రుణాల్లో 69 శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు 14 శాతం, కార్పొరేట్‌ రుణాలు 16 శాతం చొప్పున వృద్ధి సాధించడంతో మొత్తం రుణాలు 14 శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగేళ్లలో పరిశ్రమ 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తే, ఈ కంపెనీ 18% చొప్పున వృద్ధి సాధించింది. ఆర్థిక పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నప్పటికీ, తన అగ్రస్థానాన్ని నిలుపుకునే సత్తా ఈ కంపెనీకి ఉంది. కంపెనీకున్న బ్రాండ్‌ విలువ, విస్తృతమైన నెట్‌వర్క్, పటిష్టమైన వ్యాపార విధానాలు దీనికి ప్రధాన కారణాలు.

పోటీ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, సాధారణ మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఈ బ్యాంక్‌ రుణ వృద్ధి రెండేళ్లలో 16% చొప్పున చక్రగతిన వృద్ది సాధిస్తుందని అంచనా వేస్తున్నాం. కొంతకాలంగా వడ్డీరేట్లు ఒడిదుడుకులమయంగా ఉన్నప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌ 3.5% రేంజ్‌లో సాధిస్తోంది. కార్పొరేట్‌ రుణాలు మందగమనంగా ఉన్నప్పటికీ, నిమ్‌  ఇదే రేంజ్‌లో ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న కంపెనీల్లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 0.79%గా ఉన్నాయి. వంద శాతం ప్రొవిజన్‌ కవరేజ్‌ రేషియో కారణంగా నికర మొండి బకాయిలు దాదాపు లేవు. రెండేళ్లలో నికర లాభం 12% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ : కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: వెంచురా సెక్యూరిటీస్‌
టార్గెట్‌  ధర: రూ.2,008 ;   ప్రస్తుత ధర: రూ.1,408

ఎందుకంటే: వేగంగా వృద్ధి చెందుతున్న ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఇదొకటి. 1,200 బ్రాంచీలు, 2,036 ఏటీఎమ్‌లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. కార్పొరేట్‌ రుణాలు 30 శాతం, వినియోగదారుల రుణాలు 28 శాతం చొప్పున పెరిగాయి. ఫలితంగా మొత్తం రుణాలు 28 శాతం వృద్ధితో రూ.1,13,081 కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.6,068 కోట్లకు చేరింది. కాసా డిపాజిట్లు 42 శాతం పెరగ్గా, స్థూల మొండి బకాయిలు 0.93 శాతంగా, నికర మొండి బకాయిలు 0.39 శాతంగా ఉన్నాయి. 

గ్రామీణ, వ్యవసాయ రంగాలపై కేంద్రం దృష్టి సారించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించేందుకు గాను ఇటీవలే రూరల్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసి, గ్రామీణ ప్రాంత విస్తరణపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం బ్యాంక్‌కు 95 లక్షల మంది ఖాతాదారులున్నారు. మూడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపవ్వగలదని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉన్న బ్యాంక్‌లో ఇదొకటి. స్థూల మొండి బకాయిలు 1 శాతంలోపే ఉన్నాయి. 2019–20 నాటికి స్థూల మొండి బకాయిలు 1.15 శాతంగా, నికర మొండి బకాయిలు 0.55 శాతంగా ఉండగలవని అంచనా వేస్తున్నాం.

ఆర్థికంగా ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, గత పదేళ్లలో నిలకడైన వృద్ధిని సాధించింది. ఇదే జోరు మరో మూడేళ్లపాటు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో రుణాలు 23 శాతం, నికర వడ్డీ ఆదాయం 20 శాతం, డిపాజిట్లు 24 శాతం, కాసా డిపాజిట్లు 28 శాతం, ఫీజు ఆదాయం 23 శాతం  చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని భావిస్తున్నాం. 2019–20 ఆర్థిక సంవత్సరం కల్లా  నికర వడ్డీ ఆదాయం 17% వృద్ధి చెంది రూ.9,594 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం.

మరిన్ని వార్తలు