స్టాక్స్‌ వ్యూ

27 Aug, 2018 01:51 IST|Sakshi

సన్‌ ఫార్మా - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.630     టార్గెట్‌ ధర: రూ.670
ఎందుకంటే:  భారత్‌లో టర్నోవర్, మార్కెట్‌ క్యాప్‌ పరంగా అతి పెద్ద ఫార్మా కంపెనీ ఇదే. భారత్‌తో పాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా 50 ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 16% వృద్ధితో రూ.7,224 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్‌ వ్యాపారం 22 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం.అమెరికా వ్యాపారం 12 శాతం పెరగ్గా, టారో విభాగం అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్వహణ ఆదాయం 47%వృద్ధితో రూ.1,607 కోట్లకు పెరిగింది.

ఇతర వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎబిటా మార్జిన్లు 5% పెరిగి 22%కి పెరిగాయి. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ పనితీరు పటిష్టంగా ఉండటంతో నికర లాభం 88% వృద్ధితో రూ.988 కోట్లకు పెరిగింది. అమెరికా జనరిక్స్‌ వ్యాపారంలో సమస్యలున్నప్పటికీ, స్పెషాల్టీ డైవర్సిఫికేషన్‌ మంచి ఫలితాలనిస్తోంది. జనరిక్స్‌ వ్యాపారంలో ధరల ఒత్తిడి కారణంగా స్పెషాల్టీ ఔషధాలపై ఈ కంపెనీ దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు వృద్ధికి కీలకమయ్యే అంశాల్లో ఇది కూడా ఒకటి కానున్నది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి  153 ఔషధాలకు ఆమోదం పొందాల్సి ఉంది.  అమెరికా వ్యాపారం రెండేళ్లలో 15% చక్రగతి వృద్ధితో రూ.1,11,631 కోట్లకు పెరుగుతుందని అంచనా.

దేశీయ ఫార్ములేషన్స్‌ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే. రెండేళ్లలో ఈ వ్యాపారం 15% చక్రగతి వృద్ధి తో రూ.10,586 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. లాభాల మార్జిన్లు సగటు కంటే అధికంగా ఉండటం, రాబడి నిష్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటం, అమెరికా జనరిక్స్, బయోసిమిలర్స్‌ వ్యాపారాల్లో అపార అవకాశాలు, హలోల్‌ ప్లాంట్‌ సమస్య తీరిపోవడం.. సానుకూలాంశాలు. కఠినతరం అవుతున్న అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు, ధరల ఒత్తిడి కొనసాగుతుండటం... ప్రతికూలాంశాలు.


బంధన్‌ బ్యాంక్‌ - కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.674     టార్గెట్‌ ధర: రూ.825
ఎందుకంటే: పశ్చిమ బెంగాల్‌లో 2001లో సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించింది. 2014లో ఆర్‌బీఐ నుంచి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంక్‌ లైసెన్స్‌ను పొందింది. పెద్ద నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణ సంక్షోభం వంటి సమస్యలున్నప్పటికీ, గత ఐదేళ్లలో రుణాలు 51% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. నిర్వహణ వ్యయాలపై నియంత్రణ, నిలకడైన రుణ నాణ్యత కారణంగా రాబడి నిష్పత్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.  ఈ బ్యాంక్‌ సాధారణ రుణాలను కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్‌ 9% రేంజ్‌లోనే ఉండగలదని అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల మొండి బకాయిలు 0.51 శాతంగా ఉన్నాయి.

మూడేళ్లలో ఇవి 1.2%రేంజ్‌లోనే ఉండొచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో వ్యయానికి, ఆదాయానికి గల నిష్పత్తి తక్కువగా (35 శాతంగా) ఉంది. రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 3.5–4%, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 20 శాతం కంటే అధికంగా ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి నిర్వహణ ఆస్తులు రూ.32,340 కోట్లుగా ఉన్నాయి. మూడేళ్లలో రుణాలు 37 శాతం, డిపాజిట్లు 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా.  నిర్వహణ ఆస్తులు బాగా వృద్ధి చెందడం, బ్యాంకింగ్‌ రంగంలోనే అత్యధిక మార్జిన్‌లు (9–10 శాతం) ఉండటం, నిలకడైన రుణ నాణ్యత, సూక్ష్మ రుణాలపై రాబడులు అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయమయ్యే డిపాజిట్లు... ఇవన్నీ సానుకూలాంశాలు.  

మరిన్ని వార్తలు