కనీసం రెండు రోజులు ఎక్సే్ఛంజ్‌లు మూసేయండి  

25 Mar, 2020 04:18 IST|Sakshi

సెబీని కోరిన ఏఎన్‌ఎమ్‌ఐ  

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్చంజ్‌లను కనీసం రెండు రోజుల పాటు మూసేయాలని స్టాక్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్, ఏఎన్‌ఎమ్‌ఐ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీని కోరింది. దేశవ్యాప్తంగా దాదాపు 900కు పైగా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలకు అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్సే్ఛంజెస్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎన్‌ఎమ్‌ఐ)లో సభ్యత్వం ఉంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయని, అయితే స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలను అత్యవసర సంస్థలుగా కొన్ని రాష్ట్రాలు గుర్తించడం లేదని, దీంతో తమ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఎన్‌ఎమ్‌ఐ పేర్కొంది. తమ ఉద్యోగులు సకాలంలో కార్యాలయాలకు హాజరు కాలేకపోతున్నారని, విధి నిర్వహణలో విఫలమవుతున్నారని వివరించింది. స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు రెండు రోజుల పాటు సెలవులు ఇస్తే, బ్రోకరేజ్‌ సంస్థలు మొత్తం అవుట్‌స్టాండింగ్‌ పొజిషన్లను స్క్వేరాఫ్‌ చేస్తాయని పేర్కొంది. కాగా సెబీ నియంత్రణలోని స్టాక్‌ మార్కెట్‌ సంస్థలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునివ్వాలని కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కోరింది.

మరిన్ని వార్తలు