మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్!

23 Sep, 2016 02:15 IST|Sakshi
మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్!

భవిష్యత్తులోనూ కనిష్టస్థాయిలోనే అమెరికా వడ్డీ రేట్లు...
* ఫెడ్ తాజా అంచనాలతో ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్ల పరుగు
* షేర్లు, బంగారం, రూపాయి...జూమ్

ఇదిగో..అదిగో...త్వరలోనే వడ్డీ రేట్లు పెంచేస్తున్నాం అంటూ నెలల నుంచి చెపుతూ వస్తున్న అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేతులెత్తేయడంతో ప్రపంచంలో రిస్క్ ఆస్తులు మళ్లీ భారీగా ర్యాలీ జరుపుతున్నాయి. ఈక్విటీలు, కమోడిటీలు, వర్థమాన దేశాల కరెన్సీలు కలసికట్టుగా కదం తొక్కుతున్నాయి. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు పెంచడం లేదంటూ బుధవారం రాత్రి ఫెడ్ ప్రకటన వెలువడగానే అక్కడ క్రూడ్, బంగారం, వెండి, ఈక్విటీలు ఒక్కసారిగా ఎగిసిపోయాయి. అమెరికా డాలరు నిలువునా పతనమయ్యింది.

ఇక గురువారం ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో కూడా ఇదే ట్రెండ్ నడిచింది. బంగారం ఔన్సు ధర 2%పైగా ఎగిసి 1,338 డాలర్లకు చేరగా, వెండి 3.5%పెరిగింది. బ్రెంట్ క్రూడ్ తిరిగి 47.5 డాలర్ల స్థాయికి పెరిగిపోయింది. ఇదే సమయంలో భారత్ రూపాయితో సహా కొరియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తదితర వర్థమాన దేశాల కరెన్సీలు భారీగా పెరిగాయి.
 
ఫెడ్ నిర్ణయం కారణం కాదు..

తొమ్మిది సంవత్సరాల తర్వాత తొలిసారిగా గతేడాది డిసెంబర్‌లో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచినప్పుడు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లలో ఏర్పడ్డ ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. వరుసగా రెండు నెలల పాటు ఈక్విటీ మార్కెట్లు 15-20 శాతం మధ్య పతనమయ్యాయి. వర్థమాన కరెన్సీలు నిలువునా పతనమయ్యాయి. రూపాయి 4%పైగా నష్టపోయింది. ఎందుకంటే అప్పుడు భవిష్యత్తు పెంపుపై ఫెడ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ అటువంటిది. 2016లో 3 దఫాలు, 2017లో నాలుగు దఫాలు, 2018లో మరో 3 సార్లు రేట్లు పెంచుతూ  3.4%కి వడ్డీ రేట్లను చేరవచ్చన్న అంచనాల్ని ఫెడ్ అధికారులు అప్పట్లో వెలిబుచ్చారు. కానీ ఆ అంచనాలు క్రమేపీ తగ్గాయి.

తాజా ఫెడ్ సమీక్షలో ఫెడ్ అధికారుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఒకసారే పెరుగుదల వుంటుంది. ప్రస్తుతం 0.25-0.50 శాతం వున్న ఫెడ్ ఫండ్స్ రేటు (వాణిజ్య బ్యాంకులకు ఫెడ్ ఇచ్చే నిధులకు వసూలు చేసే వడ్డీ) దీర్ఘకాలంలో 2.9%కి మాత్రమే చేరవచ్చని తాజా ఫెడ్ సమీక్షలో పాల్గొన్న అధికారుల అంచనా. ఈ అంచనా ఈ ఏడాది జూన్‌లో 3% వుంది. అలాగే 2017లో రెండు దఫాలు మాత్రమే రేట్లు పెరగవచ్చన్నది ఇప్పటి అంచనా. గతేడాది డిసెంబర్‌లో వేసిన అంచనాల ప్రకారం 2017లో నాలుగుదఫాలు, ఈ ఏడాది జూన్‌లో ప్రకటించిన అంచనాల ప్రకారం మూడు దఫాలు రేట్లు పెరగాల్సివుంది.

గత అంచనాలన్నింటినీ క్రితంరోజు సమావేశంలో పూర్తిగా తగ్గించడం రిస్క్ ఆస్తుల ర్యాలీకి ప్రధాన కారణం. అంతేగానీ ఈ సెప్టెంబర్‌లో రేట్లు పెంచకపోవడం కాదు. ఈ ఏడాది డిసెంబర్‌లో పెంచే అవకాశాలున్నాయని స్పష్టమైన సంకేతాల్ని ఫెడ్ ఇచ్చినప్పటికీ, రేట్ల పెంపు నెమ్మదిగా వుంటుందనే భావనతో ప్రస్తుతానికి డిసెంబర్ పెంపును ఇన్వెస్టర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
 
సెన్సెక్స్ 266 పాయింట్లు అప్..
అంతర్జాతీయ ఈక్విటీ ర్యాలీలో భాగంగా భారత్ మార్కెట్ గురువారం రెండు వారాల గరిష్టస్థాయిలో ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 266 పాయింట్లు ఎగిసి 28,773 పాయింట్ల వద్ద ముగిసింది. 8,850 పాయింట్ల స్థాయిని అధిగమించిన నిఫ్టీ 90 పాయింట్లు పెరిగి 8,867 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెప్టెంబర్ 6 తర్వాత సూచీలకు ఇదే పెద్ద పెరుగుదల. నిఫ్టీలో భాగమైన అరబిందో ఫార్మా అన్నింటికంటే అధికంగా 6 శాతం ర్యాలీ జరిపి రూ. 855 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30 షేర్లలో 23 లాభపడ్డాయి.  ఆసియా మార్కెట్లో భారత్ మెరుగ్గా ర్యాలీ (0.93%) జరిపింది. జపాన్ మార్కెట్‌కు గురువారం సెలవుకాగా, హాంకాంగ్, తైవాన్, చైనా, ఇండోనేషియా సూచీలు 0.67% వరకూ పెరిగాయి.ఆసియాతో పోలిస్తే యూరప్ సూచీలు పెద్ద ఎత్తున ఎగిసాయి. కడపటి సమాచారంమేరకు అమెరికా మార్కెట్ 0.7% పెరుగుదలతో ట్రేడవుతోంది.
 
66.66 స్థాయికి రూపాయి
ప్రపంచ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే అమెరికా డాలరు కేవలం రెండు రోజుల్లో 1.2 శాతంపైగా పతనమైన ప్రభావంతో భారత్ రూపాయి కూడా భారీగా బలపడింది. ముంబై ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా 36 పైసలు పెరిగింది. దాంతో రూపాయి రెండు వారాల గరిష్టస్థాయి 66.66 స్థాయికి చేరింది. గురువారం రాత్రి కడపటి సమాచార మేరకు ఆఫ్‌షోర్ మార్కెట్లో ఇది మరింత ఎగిసి 66.52కి పెరిగింది. భారత్ కరెంటు ఖాతాలోటు జూన్ క్వార్టర్‌లో 0.1%కి తగ్గడమూ రూపాయి భారీ ర్యాలీకి కారణం.
 
2.5% పెరిగిన బంగారం
ప్రపంచ మార్కెట్లో వరుసగా రెండు రోజులపాటు పుత్తడి పెరిగింది. డాలరుకు అభిముఖంగా ట్రేడయ్యే బంగారం ఫెడ్ నిర్ణయం వెలువడగానే న్యూయార్క్ మార్కెట్లో బుధవారం 1,310 డాలర్ల నుంచి 1,334 డాలర్లకు (ఔన్సు ధర) చేరగా, గురువారం మరో 14 డాలర్ల పెరుగుదలతో 1,348 డాలర్లకు చేరింది. అయితే భారత్ మార్కెట్లో ఈ పెరుగుదల పరిమితంగా వుంది. రూపాయి విలువ బలపడటమే ఇందుకు కారణం. ఇక్కడ ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో కలిపి దాదాపు రూ. 450 వరకూ పెరిగి రూ. 31,315కు చేరింది. ప్రపంచ మార్కెట్లో వెండి 3.8 శాతంవరకూ పెరగడంతో ఇక్కడ కేజీకి 1,300 పెరిగి రూ. 47,500 వద్దకు చేరింది.

మరిన్ని వార్తలు