జోరుగా విదేశీ ఇన్వెస్టర్ల నమోదు

17 Dec, 2016 02:03 IST|Sakshi
జోరుగా విదేశీ ఇన్వెస్టర్ల నమోదు

ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1,700 మంది జత   

న్యూఢిల్లీ: భారత్‌లో పెట్టుబడి అవకాశాల పట్ల  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అధికాసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో కొత్తగా 1,700 మంది విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ వద్ద నమోదు కావడమే దీనికి నిదర్శనం. గత ఆర్థిక సంవత్సరంలో 2,900 మంది నమోదు చేసుకున్నారని, ఈ ఏడాది మార్చి నాటికి తమ వద్ద నమోదైన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లసంఖ్య 4,311గా ఉందని, ఈ ఏడాది అక్టోబర్‌ చివరినాటికి ఈ సంఖ్య 6,079కు పెరిగిందని సెబీ తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌–అక్టోబర్‌ కాలానికి విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లో రూ.2,800 కోట్లు పెట్టుబడులు పెట్టగా,డెట్‌మార్కెట్ల నుంచి రూ.42,600 కోట్లు ఉపసంహరించుకున్నారని పేర్కొంది. విదేశీ నిధులు తరలిపోవడానికి  పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ఒక కారణం కావచ్చని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ అంకిత్‌ అగర్వాల్‌ చెప్పారు.పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్వల్పకాలమేనని, దీర్ఘకాలంలో విదేశీ పెట్టుబడులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వివరించారు. దీర్ఘకాలానికి భారత వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. నల్ల ధనంనిరోధానికి, నగదు లావాదేవీల్లో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల దీర్ఘకాలంలో సానుకూల స్పందన వ్యక్తం కావచ్చని వివరించారు.

భారత్‌కు ప్రాధాన్యం
భారత మార్కెట్‌ నిలకడగా ఉందని, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయని, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు అపారమని, ఆర్థిక, సామాజిక సంస్కరణలు జోరుగా కొనసాగుతున్నాయని అందుకే భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికివిదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారని నిపుణులంటున్నారు. కంపెనీ బాండ్లలో నేరుగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సెబీ ఆనుమతించిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు