అమెరికా మార్కెట్‌.. సవాలే!

7 Mar, 2019 01:14 IST|Sakshi

ఔషధ కంపెనీలపై కొనసాగనున్న ఒత్తిడి

జనరిక్స్‌ ధరల ఒత్తిడి మాత్రం   కాస్త తగ్గుముఖం

సమస్య పూర్తిగా సమసిపోలేదంటున్న విశ్లేషకులు

సన్‌ఫార్మా, బయోకాన్, అరబిందోపై సానుకూలం  

న్యూఢిల్లీ: అమెరికా మార్కెట్లో భారత ఫార్మా కంపెనీలకు ధరల ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ... సమస్యలు ఇంకా పూర్తిగా సమసిపోలేదని, వృద్ధి అవకాశాలు ఇకముందు కూడా సవాలేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అబ్రివేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్ల (ఏఎన్‌డీఏ) ఆమోదం కొన్ని నెలలుగా మెరుగుపడింది. ప్రస్తుత తీరు ప్రకారం 2017–18 సంవత్సరంతో పోలిస్తే 2018–19లో ఏఎన్‌డీఏ ఆమోదాలు 38 శాతం పెరుగుతాయని ఐఐఎఫ్‌ఎల్‌ అనలిస్ట్‌ పేర్కొన్నారు. యూఎస్‌ఎఫ్‌డీఏ ఇకముందూ ఏఎన్‌డీఏల అనుమతుల వేగాన్ని పెంచనుందని అనలిస్టుల అంచనా. దీనివల్ల అమెరికా జనరిక్‌ మార్కెట్‌ వాతావరణం మెరుగుపడుతుందని, మొత్తం మీద జనరిక్స్‌ అనుమతులు తగ్గుముఖం పడతాయని భావిస్తున్నారు. అదే సమయంలో మొదటి సారి (ప్రత్యేకమైన) జనరిక్స్‌ అనుమతులు పెరుగుతాయని అంచనా. భిన్నమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులు, బయోసిమిలర్ల పరంగా ఉన్న అవకాశాల వైపు కంపెనీలు చూస్తున్నాయని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంజిత్‌ కపాడియా తెలిపారు. పోటీ కంపెనీలతో పోలిస్తే కాంప్లెక్స్‌ ఉత్పత్తులు ఉన్న కంపెనీల పట్ల బ్రోకరేజీలు సానుకూలంగా ఉన్నాయి. వీటికి అధిక వ్యాల్యూషన్‌ ఇస్తున్నాయి.  

అమెరికా మార్కెట్లో ప్రత్యేక ఉత్పత్తులు 
సన్‌ఫార్మా పట్ల సానుకూలంగా ఉండేందుకు స్పెషాలిటీ ఉత్పత్తులే కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. ఆంకాలజీ ఔషధం యోన్సా, సోరియాసిస్‌ చికిత్సలో వినియోగించే ఇలుమ్యాలను 2018–19 మొదటి అర్ధ సంవత్సరంలో సన్‌ ఫార్మా అమెరికా మార్కెట్లో విడుదల చేసింది. కంటి చికిత్సకు సంబంధించి గ్జెల్‌ప్రోస్‌ను మూడో త్రైమాసికంలో లాంచ్‌ చేసింది. అలాగే, ప్రస్తుత త్రైమాసికం (మార్చి ముగిసేలోపు)లో సీక్వాను విడుదల చేయనుంది. ఇక జనరిక్స్‌ పరంగా ఎక్కువగా ధరల ఒత్తిడి చవిచూడని దిగ్గజ కంపెనీల్లో అరబిందో ఫార్మా కూడా ఒకటి. ఏ ఉత్పత్తిపైనా ఎక్కువగా ఆధారపడి లేకపోవడం కంపెనీకి కలిసొచ్చిందన్నది విశ్లేషణ. పైగా ఇంజెక్టబుల్స్‌ వంటి పరిమిత పోటీ ఉన్న ఉత్పత్తులపైనే కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం కూడా సానుకూలించింది. దీనికి అదనంగా కొనుగోళ్ల ద్వారా వృద్ధి అవకాశాల పెంపుపై కంపెనీ దృష్టి సారించడం గమనార్హం. యూరోప్‌లో ఇటీవలే అపోటెక్స్‌ కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను అరబిందో కొనుగోలు చేసిన విషయం గమనార్హం. ఎబిట్డాకు ఐదు రెట్లు, అమ్మకాలకు ఒక రెట్టు మాత్రమే ఖర్చు చేసి చౌకగా ఈ పోర్ట్‌ఫోలియోను సొంతం చేసుకుంది. అమెరికాలో శాండజ్‌కు చెందిన డెర్మటాలజీ వ్యాపారాన్ని ఏకీకృతం చేసే పనిని కూడా చేపట్టింది. దీనివల్ల 2019–20లో కంపెనీ షేరువారీ ఆర్జన 15–20% పెరుగుతుందని ఎలారా క్యాపిటల్‌ అంచనా. అమెరికా వ్యాపారం బలంగా ఉండటం, యూరోపియన్‌ యూనియన్‌లో వృద్ధి చెందుతుండటం, ఆపరేటింగ్‌ మార్జిన్లను ప్రతికూలం నుంచి రెండంకెల లాభదాయకత దిశగా తీసుకెళ్లడం వంటివి అరబిందో వృద్ధి అవకాశాలను పెంచేవిగా విశ్లేషకుల అంచనా. ఇక లుపిన్‌ కూడా అమెరికా మార్కెట్లో వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని గ్యావిస్‌ను 2015లోనే 880 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే, ఓపియోడ్‌ ఔషధాల పరంగా 2018–19 ఆరంభంలో రూ.1,464 కోట్ల  ఏకీకృత నష్టాన్ని ప్రకటించింది. కొన్ని మాలిక్యూల్స్‌ పరంగా పనితీరు ఆశాజనకంగా లేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ మాజీ సీఎఫ్‌వో రమేష్‌ స్వామినాథన్‌ తెలిపారు.    

మరిన్ని వార్తలు