ఆ ఫోన్‌ కోసం విద్యార్థులు ఓవర్‌టైమ్‌ వర్క్‌

22 Nov, 2017 15:29 IST|Sakshi

బీజింగ్‌ : ఐఫోన్‌ ఎక్స్‌... ఆపిల్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన నూతన స్మార్ట్‌ఫోన్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. డిమాండ్‌ను చేధించడానికి మరోవైపు కంపెనీకి ఉత్పత్తి ఆలస్యమైంది. దీంతో ఆపిల్‌ సప్లయిర్‌ ఫాక్స్‌కాన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ను రూపొందించడానికి వేల కొద్ది విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకుంది. అంతేకాక వారితో ఓవర్‌టైమ్‌ వర్క్‌ కూడా చేయించినట్టు మీడియా రిపోర్టు చేసింది. ఫైనాన్సియల్‌ టైమ్స్‌ రిపోర్టు ప్రకారం 17 నుంచి 19 వయసు ఉన్న విద్యార్థులను ఫాక్స్‌కాన్‌ సెప్టెంబర్‌లో ఇంటర్న్‌లుగా నియమించుకుంది. చైనాలోని జెంగ్జౌ అసెంబ్లింగ్‌ యూనిట్‌లో వీరిని నియమించింది. మూడు నెలల పాటు ఇంటర్న్‌లుగా ఇక్కడ పనిచేస్తే పని అనుభవం కూడా వస్తుందంటూ పేర్కొంది. కానీ ఈ పని తమ చదువుకు ఏ మాత్రం సరిపోదని, తమ స్కూల్‌ వారు బలవంతం మీద ఇక్కడ పనిచేసినట్టు ఓ విద్యార్థిని చెప్పింది. ఈ విద్యార్థి 1200 ఐఫోన్‌ ఎక్స్‌లకు కెమెరాలను అసెంబుల్‌ చేసింది.

స్థానికంగా ఉన్న ఈ ఫాక్స్‌కాన్‌ యూనిట్‌లో పనిచేస్తున్న 3000 మంది జెంగ్జౌ అర్బన్‌ రైల్‌ ట్రాన్సిట్‌ స్కూల్‌ విద్యార్థుల్లో ఈమె ఒకరు. కానీ ఆపిల్‌, ఫాక్స్‌కాన్‌ రెండు కంపెనీలు విద్యార్థులు స్వచ్ఛదంగానే ఈ పనిచేస్తున్నారని పేర్కొన్నాయి. స్థానిక ప్రభుత్వాలు, వొకేషనల్‌ స్కూల్స్‌ కోపరేషన్‌తోనే ఇంటర్న్‌షిప్‌ ప్రొగ్రామ్‌లను చేపడతామని ఫాక్స్‌కాన్‌ చెబుతోంది. కానీ చైనాలోని మరో మూడు ఫాక్స్‌కాన్‌ యూనిట్లు పనిగంటలను పెంచుతూ ఆరోగ్య, భద్రతా రెగ్యులేషన్లను ఉల్లంఘిస్తుందని గార్డియన్‌ రిపోర్టు చేసింది.   ఎలాంటి పరిమితులు లేకుండా ఎక్కువ గంటల పాటు వర్కర్లను పనిచేయించేలా ఫ్యాక్టరీలకు ఆపిల్‌ అనుమతిస్తోందని న్యూయార్క్‌కు చెందిన లాభాపేక్ష లేని చైనా లేబర్‌ వాచ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లి కయాంగ్ తెలిపారు. విద్యార్థులను రాత్రి సమయాల్లో పనిచేస్తుందని, ఎక్కువ గంటల పాటు పని చేయిస్తుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు