ఎఫ్‌బీ పోస్టులతో జాబ్‌కు ఎసరు..

6 Feb, 2020 16:19 IST|Sakshi

వాషింగ్టన్‌ : ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌లో వివాదాస్పద అంశాలపై మీ అభిప్రాయాలను వెల్లడించే పోస్ట్‌లు ఉంటే మీకు ఉద్యోగం లభించే అవకాశం సన్నగిల్లినట్టేనని తాజా అథ్యయనం తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియా పోస్టుల్లో మితిమీరి తలదూర్చడం, నిర్థిష్ట అభిప్రాయాలను కలిగి ఉండే అభ్యర్ధులను రిక్రూటర్లు ఎంపిక చేసుకునే అవకాశాలు తక్కువని అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. డ్రగ్స్‌, ఆల్కహాల్‌ను ప్రోత్సహించే కంటెంట్‌ను పోస్ట్‌ చేసే వారిని కూడా తమ ఉద్యోగులుగా రిక్రూటర్లు నియమించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ సెలెక్షన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌లో ప్రచురితమైన ఈ అథ్యయనం గుర్తించింది.

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయని, తమ గురించి మిగిలిన ప్రపంచానికి తెలియచేస్తాయనే భావన ఉన్నా తమ వ్యక్తిగత ఆసక్తులు, ప్రతిభపై అమితాసక్తిని కనబరిచే వారు ఇతర ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాల కోసం త్యాగం చేసే స్వభావం తక్కువగా కలిగి ఉంటారని హైరింగ్‌ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారని పరిశోధకులు వెల్లడించారు. ఇక వివాదాస్పద అంశాలపై భిన్న ఉద్దేశాలతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేవారు సహకార ధోరణితో సర్ధుకుపోయే స్వభావం కలిగిఉండరని, వాదన ధోరణిని కలిగిఉంటారనే అభిప్రాయం రిక్రూటర్లలో నెలకొందని విశ్లేషించారు. ఇక మద్యం, డ్రగ్‌ వాడకంపై పోస్ట్‌లు చేసేవారు ఒక ఉద్యోగంలో కుదురుగా ఉండరని రిక్రూటర్లు భావిస్తున్నారని పరిశోధకులు తెలిపారు.

చదవండి : నువ్వే నా సర్వస్వం - ఫేస్‌బుక్‌ సీవోవో

మరిన్ని వార్తలు