1500 శాఖలు మూతపడ్డాయ్‌! 

10 Nov, 2018 02:20 IST|Sakshi

ఎస్‌బీఐ అనుబంధ శాఖల విలీన ఫలితం 

ఎన్‌పీఏలకు కారణం కేంద్రం, ఆర్‌బీఐ 

ఆఖిల భారత స్టేట్‌బ్యాంక్‌ అధికారుల సమాఖ్య చైర్మన్‌ సుబ్రమణ్యం  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం అటు కస్టమర్లు, ఇటు బ్యాంకు ఉద్యోగులకు చేటు చేస్తుందని ఆల్‌ఇండియా స్టేట్‌బ్యాంక్‌ ఆఫీసర్స్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ జీ. సుబ్రమణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. విలీనాలతో కస్టమర్లకు అందించే సేవలపై, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితాలపై పెను ప్రభావం పడుతుందన్నారు. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఐదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేయడంతో దేశవ్యాప్తంగా దాదాపు 1500 శాఖలు మూతపడ్డాయని, 15,000మంది కి పైగా ఉద్యోగులు రిటైర్‌మెంట్‌ తీసుకున్నారని వివరించారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 200కు పైగా శాఖలను మూసివేయడం జరిగిందని, దీంతో ఆయా ప్రాంతాల్లో కస్టమర్లకు బ్యాంకింగ్‌ సేవలు అందకుండా పోయాయన్నారు.  ఇతర పీఎస్‌బీలను విలీనం చేసినా ఇదే విధంగా పలు శాఖలు మూతపడతాయని, విలీనం చేసుకున్న బ్యాంకు నష్టాలను చవిచూస్తుందని చెప్పారు. ఎస్‌బీఐ ఫలితాల్లో ఎప్పుడూ కార్యనిర్వాహక లాభం క్షీణించలేదని, మొండిపద్దుల కేటాయింపుల కారణంగా నికర లాభం మాత్రం హరించుకుపోయిందని వివరించారు. 

ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వాల దొంగాట 
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరగడానికి ప్రధాన కారణం ప్రభుత్వం, ఆర్‌బీఐఅని సుబ్రమణ్యం ఆరోపించారు. బడాబడా కార్పొరేట్లకు లోన్లను బ్యాంకు అధికారులు మంజూరు చేయలేరని, కేవలం బ్యాంకు బోర్డు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలవని అన్నారు. ఇప్పుడు దీనిపై కేంద్రం, ఆర్‌బీఐ దొంగాట ఆడుతున్నాయని వివరించారు. కాగా, ఈ నెల 11న ఎస్‌బీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌(హైదరాబాద్‌ సర్కిల్‌) 32వ జనరల్‌బాడీ  సమావేశం జరగనుంది. 

>
మరిన్ని వార్తలు