ఆర్థిక వ్యవస్థలో రాజన్ ‘టైమ్బాంబ్’

10 Jun, 2016 01:08 IST|Sakshi
ఆర్థిక వ్యవస్థలో రాజన్ ‘టైమ్బాంబ్’

సుబ్రమణ్యస్వామి మరోసారి విసుర్లు
డిసెంబర్‌లో  పేలుతుందని వ్యాఖ్య

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి మరోసారి తీవ్ర విమర్శలకు దిగారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త భారత్ ఆర్థిక వ్యవస్థలో టైమ్ బాండ్ పెట్టారని, ఇది డిసెంబర్‌లో పేలుతుందని వ్యాఖ్యానించారు. రాజన్‌పై పత్రికాముఖంగా విమర్శలు చేయడంతోపాటు గత నెల స్వయంగా ప్రధానికిసైతం రెండుసార్లు లేఖలు రాసిన స్వామి, తన తాజా విమర్శలకు ఈ సారి ట్విటర్‌ను ఎంచుకున్నారు. ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థలో ఆర్3 (రఘురామ్ రాజన్) 2013లో ఒక టైమ్‌బాంబ్  పెట్టారు. డిసెంబర్ 2016లో ఇది పేలుతుంది. బ్యాంకులు 24 బిలియన్ డాలర్లను ఎఫ్.ఈ.ల్లో చెల్లించాల్సి ఉంటుంది’’ అని ట్వీట్ చేశారు. అయితే ఇంతకుమించి ఆయన ఇంకేమీ వివరించలేదు. ‘ఎఫ్.ఈ.’ అన్న పదం విదేశీ మారకద్రవ్యం (పారిన్ ఎక్స్ఛేంజ్) అని అర్థం. 

 ఆరోపణలో పసలేదా?
2013లో విదేశీ కరెన్సీ బాండ్లు జారీ ద్వారా బ్యాంకులు 24 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను సమీకరించాయి. ఈ ఏడాది చివరకు ఆ బాండ్ల మెచ్యూరిటీ ఉంది. అప్పట్లో రూపాయి విలువను పటిష్టపర్చేదిశగా దేశంలోకి విదేశీ మారకాన్ని తేవాలన్న లక్ష్యంతో విదేశీ కరెన్సీ బాండ్ల జారీకి రిజర్వుబ్యాంక్ అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇటీవలే రాజన్ ప్రస్తావిస్తూ... ఈ బాండ్ల చెల్లింపులు బ్యాంకులకు ఇబ్బంది ఏదీ కాదని, అవసరమైతే బ్యాంకులకు తగిన విదేశీ కరెన్సీని ఆర్‌బీఐ సర్దుబాటు చేస్తుందన్నారు. స్వామి ఆరోపణలు బహుశా ఈ అంశానికే సంబంధించినది అయితే ఈ విమర్శలో పసలేదన్నది నిపుణుల విశ్లేషణ.

మరిన్ని వార్తలు