సొంతింటికి దారేది?

24 May, 2014 00:56 IST|Sakshi
సొంతింటికి దారేది?

     మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో శివారు ప్రాంతాల అభివృద్ధి
    
  కొంత దూరం వెళితే చాలు సొంతిల్లు కొనొచ్చు
    
వరంగల్ రహదారిలో అందుబాటులో స్థిరాస్తి ధరలు
    
సాగర్ రోడ్, రాజీవ్ రహదారిలో కూడా అంతే

 

మరి హైదరాబాద్‌లో దిగువ, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి స్వప్నం తీరదా? ఎంతో మందిని వేధిస్తున్న ఈ సందేహం తీర్చడానికి ‘సాక్షి రియల్టీ’ నగరం చుట్టూ పర్యటించింది. నగరం నుంచి కొంత దూరం వెళ్లడానికి సిద్ధపడితే చాలు.. సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చని గుర్తించింది.

ఏయే ప్రాంతాల్లో తక్కువ ధరలకు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయో వివరించేదే

ఈవారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనం..
 సాక్షి, హైదరాబాద్:  హైదరాబాద్‌లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో వరంగల్ రహదారి ఒకటి. మెట్రో రైల్ నిర్మాణం, ఔటర్ రింగ్‌రోడ్డే ఇందుకు కారణం. ఇప్పటికే ఈ ప్రాంతంలో సర్వే ఆఫ్ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, సీసీఎంబీ, ఐఐసీటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో పాటు సింగపూర్ సిటీ, ఇన్ఫోసిస్, రహేజ ఐటీ పార్కులతో ఇక్కడ స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. గతంలో ప్లాంటింగ్ వెంచర్లకే పరిమితమైన ఈ ప్రాంతంలో ఇప్పుడు ఫ్లాట్లు, విల్లాల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఉప్పల్ రింగ్‌రోడ్డు నుంచి నాలుగైదు కిలో మీటర్ల పరిధిలో ఉన్న ఫీర్జాదిగూడ, పర్వతాపూర్, బోడుప్పల్, మల్లాపూర్, చెంగిచెర్ల గ్రామాలు.. సింగపూర్ సిటీకి దగ్గర్లో ఉన్న చౌదరిగూడ, అన్నోజిగూడ, పోచారం గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇండిపెండెంట్ హౌస్‌లు, అపార్ట్‌మెంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఫ్లాటైతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు, ఇండిపెండెంట్ హౌస్‌కు రూ.18 నుంచి రూ.25 లక్షల వరకు ధరలున్నాయి.

 జాతీయ రహదారి వెంబడి ఉన్న ప్రాంతం హయత్‌నగర్ మండలం. వనస్థలిపురం, ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో రూ.35 లక్షల వరకు పెడితేగానీ సొంతిల్లు దొరకడం లేదు. తొమ్మిదో నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో, ఔటర్ రింగ్‌రోడ్ సమీప గ్రామాల్లో కూడా భారీ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కుంట్లూరులో రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ధర ఉంది. పసుమాముల, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్ మెట్, అనాజ్‌పూర్, బాటసింగారం గ్రామాల్లో రూ.12 లక్షలలోపే ఇల్లు దొరుకుతుంది. నాగోల్‌కు దగ్గరగా ఉన్న తట్టిఅన్నారం, మత్తుగూడ గ్రామాల పరిధిలో రూ.15 లక్షలకు పైగా ధర ఉంది.

చాలామంది దృష్టిపడని ప్రాంతాల్లో సాగర్‌రోడ్డు ఒకటి. బీఎన్‌రెడ్డి నగర్ దాటిన తర్వాత ఎయిర్‌ఫీల్డ్, రహదారి వెంబడి రెండు కిలోమీటర్ల మేరకు అటవీశాఖ భూములు ఉండడంతో వెంటనే నగరాన్ని దాటి వెళ్లిపోతున్న అనుభూతి వస్తుంది. దీనివల్లే ఈ ప్రాంతం చాలామంది దృష్టిలో పడలేదు. బొంగ్లూరు వద్ద ఔటర్ రింగ్‌రోడ్ జంక్షన్‌ను నిర్మిస్తుండటంతో ఇప్పుడు ఈ ప్రాంతానికి మంచి గిరాకీ ఉంది. గుర్రంగూడ, ఇంజాపూర్, తుర్కయాంజాల్, రాగన్నగూడ తదితర గ్రామాల పరిధిలో సొంతిల్లు కావాలంటే రూ.15 లక్షల నుంచి పెట్టాల్సి ఉంటుంది. రహదారికి దగ్గరగా ఉంటే మాత్రం అదనంగా మరో రెండు లక్షలు పెట్టాలి.

సరూర్‌నగర్ మండలం పరిధిలోని జిల్లెలగూడ, మీర్‌పేట్, అల్మాస్‌గూడ, బడంగ్‌పేట, నాదర్‌గుల్ గ్రామాల్లో 120 గజాల ఇల్లు రూ.12 లక్షలు, 150 గజాల ఇల్లు కోసం రూ.14 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ధర ఉంది.

కుషాయిగూడ చుట్టుపక్కల అన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాలే. దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి గ్రామాల్లో రూ.17 లక్షల నుంచి రూ.25 లక్షల్లో ఇల్ల్లు దొరుకుతున్నాయి.

ఇప్పుడు అందరి దృష్టి రాజీవ్ రహదారిలోని శామీర్‌పేట్, పాత ముంబై మార్గంలోని కొంపల్లి, మేడ్చల్ ప్రాంతాలపైనే ఉంది. ఇక్కడ సొంతిల్లు కావాలంటే రూ.25 లక్షల పైమాటే. అలాగని నిరాశ పడక్కర్లేదు. శామీర్‌పేట వరకు వెళితే రూ.16 నుంచి రూ. 18 లక్షల్లోపే కొనేయొచ్చు.

మరిన్ని వార్తలు