ప్లాట్లకు తగ్గని గిరాకీ!

17 Mar, 2017 23:12 IST|Sakshi
ప్లాట్లకు తగ్గని గిరాకీ!

ఆదిభట్ల, యాదాద్రి, షామీర్‌పేట, షాద్‌నగర్‌.. దశాబ్ధ క్రితం దాకా శివారు ప్రాంతాలు! కానీ, ఇప్పుడు అభివృద్ధికి హాట్‌స్పాట్స్‌. ఇంకా చెప్పాలంటే ప్రధాన నగరంతో సమానమైన ధరలున్న ప్రాంతాలు! గతంలో గజానికి రూ. 2–3 వేలు కూడా పలకని స్థలాల ధరలు నేడు ఆకాశాన్నంటాయి. మరీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. కొత్త జిల్లాల విభజనతో స్థలాల ధరలు మరింత పెరిగాయి.

సాక్షి, హైదరాబాద్‌
స్థిరాస్తి మార్కెట్‌ అభివృద్ధికి సెంటిమెంటే ప్రధానం. ప్రత్యేకించి ప్లాట్ల విషయంలో! ఒక ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశముందంటే చాలు ఎవరి స్థోమతకు తగ్గట్టుగా వారు ప్లాట్లు కొంటుంటారు. ఉద్యోగావకాశాలను కల్పించే సంస్థలు ఏ ప్రాంతంలో వస్తున్నాయో పరిశోధన చేసి మరీ పెట్టుబడులు పెడుతుంటారు. అప్పు చేసో.. ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టో.. బ్యాంకు రుణం తీసుకుని మరీ ఆయా ప్రాంతాల్లోని స్థలాలపై ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. భవిష్యత్తులో రేటు పెరిగి పిల్లల చదువులకో, పెళ్లికో అక్కరకొస్తుందనే దూరదృష్టితో ఉంటారు. వ్యాపారులు, పెట్టుబడిదారులు జట్టుగా ఏర్పడి ఎకరాల విస్తీర్ణాల్లో భూములను కొంటారు.పొరపాటున ధరలు తగ్గినా.. మార్కెట్‌ మందగమనానికి చేరినా.. ముందడుగు వేయరు. భవిష్యత్తులో అభివృద్ధికి ఆస్కారముందని తెలిసినా కొనడానికి సందేహిస్తుంటారు.

2002 వరకూ శివారు ప్రాంతాల్లో గజం ధర రూ.2–3 వేలు పలకడమే ఎక్కువ. తెలంగాణ ఏర్పడ్డాక, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక రూ.20 వేల పైకి చేరాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ధరలు తక్కువగా ఉండటం, సానుకూల వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, జీవన వ్యయం తక్కువగా ఉండటం వంటి కారణాలతో ప్రవాసాంధ్రులు, పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థలాలను కొనుగోలు చేశారు. చేస్తున్నారు కూడా.

ఐటీతో జోరు..
గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, మణికొండ వంటి ప్రాంతాలపై అమ్మకాలు ఏనాడు కూడా ప్రతికూల పరిస్థితులకు చేరవు. కారణం ఐటీ హబ్‌గా పేరొం దడమే. ఇప్పుడిదే తరహా వాతావరణాన్ని తూర్పు ప్రాంతం సంతరించుకుంటోంది. మెట్రో రైలు తొలిసారిగా పరుగులు పెట్టేది ఇక్కడి నుంచే కావటం అదనపు అంశం. ఉప్పల్, ఆదిభట్ల ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, ఏరో స్పేస్‌ సంస్థలొచ్చాక స్థిరాస్తికి మంచి డిమాండ్‌ వచ్చింది. ఇప్పుడీ ప్రాంతాల్లో ప్లాట్ల మార్కెట్టే కాదు అపార్ట్‌మెంట్లు, విల్లాలు, వాణిజ్య సముదాయాలు కూడా భారీగా వెలుస్తున్నాయి. ప్రధాన ర హదారికి ఎంత చేరువలో ఉంది? ప్లాటు దిక్కు ఆధారంగా తుది రేటు ఆధారపడి ఉంటుందనేది మరిచిపోవద్దు.

మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో, డిపోలు ఏర్పాటుకానున్న ప్రాంతాల్లోని స్థలాలకు గిరాకీ పెరిగింది. మెట్రో పనులు జోరుగా జరుగుతుండటం వల్ల ప్లాట్ల ధరల్ని అంతే స్పీడుగా పెంచేశారు కొందరు డెవలపర్లు. అయితే గత కొంతకాలంగా మియాపూర్, బాచుపల్లి, ప్రగతినగర్, చందానగర్‌ తదిత ర ప్రాంతాల్లో అమ్మకాలు కాసింత తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిస్థితి కొంత కాలమేనని రియల్టర్లు దీమా వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు